Revanth Reddy: ఒకప్పుడు పాలమూరు వలసల జిల్లాగా పేరు పొందిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అప్పట్లో తట్ట పని, పార పనుల కోసం పాలమూరు ప్రజలు దేశం నలుమూలలా కూలీలుగా వెళ్లాల్సి వచ్చిందని, దానికి ప్రధాన కారణం విద్యలో వెనుకబాటుతనం అని ఆయన స్పష్టం చేశారు. స్వరాష్ట్రం వస్తే అభివృద్ధి కలుగుతుందని ప్రజలు ఆశించినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు అభివృద్ధి వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముసాపేట మండలం వేములలో SGD కార్నింగ్ కంపెనీ రెండో యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇకపై పాలమూరు జిల్లా విద్య, ఉపాధి, అవకాశాల కేంద్రంగా నిలుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. విద్యా వసతుల కల్పనను తన వ్యక్తిగత బాధ్యతగా స్వీకరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
భూముల బదులు ఇళ్లు
కొడంగల్, నారాయణపేట ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల కోసం భూసేకరణ జరుగుతుందని, రైతుల ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే నారాయణపేట ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. భూసేకరణ ప్రక్రియపై మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దుమీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు
ప్రతిపక్షాలపై విమర్శలు
ప్రతిపక్షాలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆటంకాలు సృష్టిస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. మీడియా కూడా నిరాధారమైన వార్తలకు లొంగకుండా వాస్తవాలు ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరులో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల కోసం స్థలాలు చూపించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
“మొదటి ముద్ద పాలమూరుకే”
“నా కుర్చీ ప్రజల విశ్వాసంతో వచ్చింది. అందుకే మొదటి ముద్ద ఎప్పుడూ పాలమూరుకే” అని సీఎం ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో శాశ్వతంగా ఏ పార్టీ లేదా నాయకుడు ఉండరని గుర్తుచేశారు. “ఒకప్పుడు జనతా పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండేది. కానీ అది కాల గర్భంలో కలిసిపోయింది. పాపం ఎప్పుడూ వృథా కాదు” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.