Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్డీయే (NDA) కూటమి అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తమిళ సంస్కృతి, భాష మరియు తెలుగు-తమిళ ప్రజల మధ్య ఉన్న విడదీయలేని బంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
తమిళ గడ్డతో అనుబంధం.. నా పెళ్లి జరిగింది ఇక్కడే!
తమిళనాడు అంటే ద్రవిడ సంస్కృతికి మూలమని, ఈ గడ్డపై ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు ఎంతో ప్రత్యేకమని చంద్రబాబు కొనియాడారు. “తమిళం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన భాషలలో ఒకటి. మీ మాదిరిగా మాతృభాషను ప్రేమించే వారు మరెక్కడా ఉండరు” అని ఆయన ప్రశంసించారు. తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, తన వివాహం కూడా చెన్నైలోనే జరిగిందని, చిత్తూరు, తిరుపతి సరిహద్దుల్లో ఇప్పటికీ ప్రజలు తమిళమే మాట్లాడతారని ఆయన వివరించారు.
ఎన్టీఆర్ – ఎంజీఆర్ స్నేహం.. తెలుగు గంగ జ్ఞాపకాలు
మహానాయకుడు ఎన్టీ రామారావుకు తమిళనాడు గడ్డకు ఉన్న సంబంధాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. “ఎన్టీఆర్, ఎంజీఆర్ గారు ప్రాణ స్నేహితులు. వారిద్దరూ కలిసి 1983 ఏప్రిల్ 27న తమిళనాడు దాహార్తిని తీర్చడానికి ‘తెలుగు గంగ’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఆ స్నేహం రెండు రాష్ట్రాల మధ్య నీటి బంధాన్ని పెంచింది” అని పేర్కొన్నారు. ద్రవిడ సంస్కృతిని కాపాడటానికే తాము కుప్పంలో ‘ద్రవిడ విశ్వవిద్యాలయం’ ఏర్పాటు చేశామని చెప్పారు.
నదుల అనుసంధానం: మోదీతోనే సాధ్యం
భవిష్యత్తులో దేశానికి నీటి భద్రత కలగాలంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గమని చంద్రబాబు స్పష్టం చేశారు. “గంగా-కావేరి అనుసంధానం కావాలి. అలాగే గోదావరి-కృష్ణా-కావేరీ నదులను కలిపే బృహత్తర కార్యం కేవలం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రగతిని, తమిళనాడు అభివృద్ధిని కాంక్షించేది కేవలం ఎన్డీయే మాత్రమేనని, తమిళుల ప్రయోజనాలను పట్టించుకోని పార్టీలను తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
కోయంబత్తూరు పూర్వవైభవం కోసం..
ఒకప్పుడు దక్షిణ భారతంలో పారిశ్రామిక కేంద్రంగా ఉన్న కోయంబత్తూరు అభివృద్ధికి ఎన్డీయే కట్టుబడి ఉందని చంద్రబాబు చెప్పారు. అబ్దుల్ కలాం, సీవీ రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మేధావులను అందించిన ఈ గడ్డపై, తమిళ ప్రజల కష్టపడే మనస్తత్వమే వారి విజయరహస్యమని కొనియాడారు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో తమిళనాడు అగ్రగామిగా ఉండాలంటే కూటమికి ఓటు వేయాలని కోరారు.
