Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర అభివృద్ధి కోసం పలు కీలక అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం.
గత బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయించిన అంశాలను గుర్తు చేసిన సీఎం చంద్రబాబు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం గత మధ్యంతర బడ్జెట్‌లో కేటాయించిన రూ.15 వేల కోట్ల నిధులను త్వరగా విడుదల చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుండి మరింత సహకారం అవసరమని వివరించారు. పోలవరానికి సంబంధించి వరద సెస్ అనుమతిని ఇవ్వాలని కూడా సీఎం కోరారు. విశాఖపట్నం రైల్వే జోన్‌కి శంకుస్థాపన చేయాలని, ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రధాని మోడీ రావాలని ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర పథకాల్లో రాష్ట్రానికి భాగస్వామ్యాన్ని పెంచాలని కోరారు. కేంద్ర నిధులు సకాలంలో అందించాలని మరియు ఆంధ్రప్రదేశ్‌కి ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఈ చర్చల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సావధానంగా స్పందించి, సానుకూలంగా పరిగణించామని సమాచారం.