Chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎండగడుతూ, తిరుమల పవిత్రతను కాపాడటమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.
నివేదిక వచ్చాకే మాట్లాడా: తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని తాను ఆధారాల్లేకుండా మాట్లాడలేదని ముఖ్యమంత్రి వివరించారు. NDDB (National Dairy Development Board) ఇచ్చిన అధికారిక నివేదికలో జంతువుల కొవ్వు కలిసిందని స్పష్టంగా తేలిన తర్వాతే తాను ఆ నిజాన్ని భక్తుల ముందుకు తెచ్చానని చెప్పారు. వాస్తవాలు బయటపెడితే వైసీపీ నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Stock Market Crash: బడ్జెట్ దెబ్బ.. స్టాక్ మార్కెట్ విలవిల.. కుప్పకూలిన బ్రోకరేజ్ స్టాక్స్!
తప్పు చేసి ఎదురుదాడి: తిరుమల కొండపై వైసీపీ నేతలు మహాపాపం చేశారని చంద్రబాబు ఆరోపించారు. నెయ్యి కల్తీకి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు తాము సిట్ (SIT) వేస్తే, దానిపై కూడా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. “పాపం చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారు.. పైగా నన్నే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
తిరుమల పవిత్రత నా బాధ్యత: కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు అన్నారు. గతంలో జరిగిన అపచారాలను సరిదిద్ది, మళ్ళీ స్వామివారి ప్రసాదం నాణ్యతను పెంచేందుకు తమ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని భక్తులకు భరోసా ఇచ్చారు.
