Chandrababu: ఆరోగ్య శాఖపై సమీక్ష.. పూర్తిగా ప్రక్షాళన..

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక ప్రతిపాదనలకు ఆయన ఆమోదం తెలిపారు. 108 అంబులెన్స్ సేవల మెరుగుదల కోసం 190 కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి రూ.60 కోట్ల వ్యయం మంజూరు చేశారు. 108 డ్రైవర్లకు జీతం తో పాటు అదనంగా రూ.4 వేలు భత్యం అందించే విధానాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు.

పేద ప్రజల మృతదేహాలను తరలించేందుకు మహాప్రస్థానం వాహనాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. అలాగే, ఎన్టీఆర్ బీమా పథకాన్ని రెండు యూనిట్లుగా విభజించి అమలు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవలు ట్రస్ట్ విధానంలో నడుస్తున్నప్పటికీ, దీన్ని బీమా విధానంగా మార్చేందుకు అవసరమైన మార్గాలను పరిశీలించారు.

గ్రామీణ ప్రాంతాల్లో 104 అంబులెన్స్ సేవలను బలోపేతం చేయాలని, ఇందులో ల్యాబ్ టెక్నీషియన్‌లను నియమించి రక్తపరీక్షలు, ఇతర సాధారణ వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. 108, 104, ఎన్టీఆర్ బీమా పథక సేవలను ఒకే కాల్ సెంటర్ ద్వారా సమన్వయం చేయాలని ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు.

ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై ముఖ్యంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. 104 అంబులెన్స్‌ల ద్వారా రక్త పరీక్షలు సహా వివిధ వైద్య పరీక్షలను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని తెలిపారు. ప్రజలకు హెల్త్ కార్డులు అందించేందుకు ప్రభుత్వమే ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు పథకాలు సిద్ధం చేయాలని అభిప్రాయపడ్డారు.

వైద్య రంగంలో ఏఐ సాంకేతికతను ఉపయోగించి అనారోగ్యంతో బాధపడే ప్రజలకు టెక్నాలజీ ద్వారా వైద్య సేవలను అందించేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *