Delhi: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల ప్రభావం నుంచి రాష్ట్రాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయం ప్రకటించింది. విపత్తు మరియు వరద సహాయ నిధుల కింద ఐదు రాష్ట్రాలకు కలిపి రూ. 1554.99 కోట్లు విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తుల కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, పునరుద్ధరణ పనులకు ఉపయోగించుకోవచ్చు.
ఈ రాష్ట్రాలకు నిధుల మంజూరు
ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ. 1554.99 కోట్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు కేటాయింపు జరిగింది.
ఆంధ్రప్రదేశ్: రూ. 608.08 కోట్లు
తెలంగాణ: రూ. 231.75 కోట్లు
త్రిపుర: రూ. 288.93 కోట్లు
ఒడిశా: రూ. 255.24 కోట్లు
నాగాలాండ్: రూ. 170.99 కోట్లు
ఈ నిధులను ఆయా రాష్ట్రాలు వరదలు, భూకంపాలు, తుపానులు, భారీ వర్షాలు, భూస్ధలపు వంటి విపత్తుల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ నిధులు రాష్ట్రాల్లో పునరుద్ధరణ పనులు, ఇళ్ల నిర్మాణం, వ్యవసాయ నష్టం పూడ్చడం, రహదారుల మరమ్మతులు, తాగునీటి సదుపాయాల పునర్నిర్మాణం వంటి కార్యకలాపాలకు వినియోగించనున్నారు.
కేంద్రం విడుదల చేసిన నిధులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. విపత్తుల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం ఈ సహాయం చేసినట్లుఅధికారులు తెలిపారు.