Punjab: పంజాబ్‌లోని మొహాలీలో గురువారం జరిగిన ఈడీ సోదాలు ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సినిమాను తలపించాయి. మనీ లాండరింగ్, భూ కుంభకోణాల ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేస్తుండగా, నిందితులు తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీశాయి.
డబ్బు సంచులతో పరార్:
అసలేం జరిగిందంటే.. ఖరార్ ప్రాంతంలోని ‘వెస్టన్ టవర్’ అనే ఎత్తైన భవనానికి ఈడీ బృందాలు చేరుకున్నాయి. అధికారులు లోపలికి వస్తున్నారని గమనించిన తొమ్మిదో అంతస్తులోని వ్యక్తులు, హడావిడిగా డబ్బుతో ఉన్న సంచులను కిటికీలోంచి కిందకు విసిరేశారు. ఆ సంచులు కింద పడే సమయంలో కొన్ని 500 నోట్ల కట్టలు గాలిలో ఎగిరాయి. అయితే, అధికారులు అక్కడికి చేరుకునేలోపే నితిన్ గోహల్ అనే వ్యాపారవేత్త డ్రైవర్, కింద పడిన ఆ సంచులను తీసుకుని కారులో వేగంగా పరారయ్యాడు. ప్రస్తుతం ఈడీ బృందాలు ఆ కారు కోసం గాలిస్తున్నాయి.
భూ కుంభకోణం కోణంలో సోదాలు:
మొహాలీ, చండీగఢ్ ప్రాంతాల్లో దాదాపు 12 చోట్ల ఈ సోదాలు ఏకకాలంలో జరిగాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులే లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. గ్రేటర్ మొహాలీ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (GMADA) ద్వారా భూమి అనుమతుల్లో (CLU) అక్రమాలు జరిగాయని అధికారులకు ఫిర్యాదులు అందాయి. అమాయక పెట్టుబడిదారుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలతో సన్‌టెక్ సిటీ, ఆల్టస్ బిల్డర్స్ వంటి ప్రముఖ సంస్థల కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాజకీయ ప్రకంపనలు:
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అకాలీదళ్ సీనియర్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజీతియా ఈ వీడియోలను షేర్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవనం పైనుంచి డబ్బులు విసిరేయడం చూస్తుంటే రాష్ట్రంలో అవినీతి ఎంతలా వేళ్లూనుకుందో అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు. ఈ సోదాల్లో ఇంకా ఎంత మేర అక్రమ సొమ్ము, కీలక పత్రాలు బయటపడతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
