Case on YS Jagan: గుంటూరు జిల్లాలో జూన్ 18న జరిగిన రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఘటనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా కేసులో చేర్చారు. పోలీసులు ఆయనను రెండో నిందితుడిగా (A2) పేర్కొన్నారు.
ఏం జరిగింది..?
జగన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామానికి పర్యటనకు వెళ్తున్న సమయంలో, గుంటూరు జిల్లా ఎటుకూరు బైపాస్ వద్ద ఆయన కాన్వాయ్‌లోని వాహనం ఒకటి సింగయ్య అనే వైఎస్సార్సీపీ కార్యకర్తను ఢీకొట్టింది. సింగయ్య, జగన్‌ను స్వాగతించేందుకు పూలు వేస్తూ రోడ్డుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయాలపాలైన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
వీడియో ఫుటేజ్ ఆధారంగా కేసు మార్పు
ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ, డ్రోన్ ఫుటేజ్‌లు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ వీడియోల్లో జగన్ ప్రయాణించిన AP 40 DH 2349 నెంబర్ గల ఫార్చ్యూనర్ కారు సింగయ్యను ఢీకొట్టినట్టు స్పష్టమైంది.
దీంతో మొదట 106(1) BNS సెక్షన్ కింద నమోదు చేసిన కేసును, తర్వాత BNS సెక్షన్లు 105 (కల్పబుల్ హోమీసైడ్) మరియు 49 (నేరానికి ప్రేరణ)గా మార్చారు.
ఏం సెక్షన్లు.. ఏమి శిక్షలు?
-
BNS సెక్షన్ 105: ఇది హత్యగా పరిగణించని, కానీ మరణానికి కారణమైన నేరాలపై వర్తిస్తుంది. దీనిపై నిరూపితమైనట్లయితే 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష, లేదా జీవితఖైదు వరకూ శిక్ష పడొచ్చు. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్.
-
BNS సెక్షన్ 49: ఇది నేరానికి ప్రేరణ ఇచ్చినట్టు భావించినప్పుడు వాడతారు.
ఇది కూడా చదవండి: Telangana Cabinet Meeting: ఈరోజు తెలంగాణ కాబినెట్ మీటింగ్.. ఈ అంశాలపై చర్చ..
ఎవరెవరు నిందితులు..?
పోలీసులు మొత్తం ఆరుగురు వ్యక్తులను కేసులో నిందితులుగా చేర్చారు:
-
A1 – రమణా రెడ్డి (డ్రైవర్)
-
A2 – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
A3 – కె. నాగేశ్వర రెడ్డి (జగన్ వ్యక్తిగత కార్యదర్శి)
-
A4 – వైవీ సుబ్బారెడ్డి (మాజీ ఎంపీ)
-
A5 – పేర్ని నాని (మాజీ మంత్రి)
-
A6 – విడదల రజిని (మాజీ మంత్రి)
ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు
గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ – “జూన్ 18న జరిగిన ఈ ఘటనపై పూర్తి ఆధారాలు సేకరించాం. సాంకేతిక ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో విచారణ పూర్తిచేశాం. అందులో పొందిన ఆధారాల ప్రకారం కేసులో మార్పులు చేశాం. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది,” అని తెలిపారు.
కీలకం: ఈ ఘటనపై అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్పందనలు వచ్చాయి. ఈ కేసు ఫలితం రాజకీయంగా ఏం మార్పులు తీసుకురాస్తుందో చూడాలి.