Crime News:

Crime News: మరో గంటలో పెళ్లి.. చీర వల్ల వచ్చిన గొడవ.. వధువును హత్య చేసిన వరుడు

Crime News: పెళ్లి పీటల దాకా వచ్చిన ఓ బంధం… మలుపు తిరిగింది, కానీ జీవితానికి కాదు, మృత్యువుకు. మరో గంటలో తాళి కట్టాల్సిన వాడు, కాబోయే భార్యపై ఆగ్రహంతో ఊగిపోయి దారుణంగా హత్య చేసిన హృదయ విదారక ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో చోటుచేసుకుంది. ప్రేమించి, ఏడాదిన్నరగా సహజీవనం చేసిన జంట కథ.. వివాహానికి కొద్ది నిమిషాల ముందు రక్తంతో ముగిసింది.

పెళ్లికి ముందు పెరిగిన వివాదం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడు సాజన్ బరయ్య, బాధితురాలు సోని రాథోడ్ (హిమ్మత్ రాథోడ్) గత ఏడాదిన్నర కాలంగా కుటుంబాలకు దూరంగా ఉంటూ సహజీవనం చేస్తున్నారు. వారి నిశ్చితార్థం, ఇతర ఆచారాలు పూర్తయిన నేపథ్యంలో శనివారం రాత్రి వారికి వివాహం జరగాల్సి ఉంది.

అయితే, సంతోషంగా మొదలవ్వాల్సిన ఆ ఘడియల ముందు.. వారిద్దరి మధ్య చిన్నపాటి వివాదం రాజుకుంది. పెళ్లికి కట్టుకోవాల్సిన చీర, డబ్బుల విషయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ మాటామాటా పెరగడం చినికిచినికి గాలివానలా మారి, ఊహించని దారుణానికి దారి తీసింది.

గొడవ తీవ్రం కావడంతో, ఆగ్రహావేశాలకు లోనైన సాజన్.. పక్కనే ఉన్న  ఇనుప రాడ్‌ (పైపు)ను తీసుకుని సోనిపై అతి కిరాతకంగా దాడి చేశాడు. అంతటితో ఆగకుండా, ఆమె తలను బలంగా పట్టుకుని గోడకేసి గుద్దించాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన సోని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఈ దారుణానికి పాల్పడిన తర్వాత భయంతో నిందితుడు సాజన్ అక్కడి నుంచి పరారయ్యాడు. పారిపోయే ముందు ఆ ఇంటిని ధ్వంసం కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Vangaveeti Ranga: రాజకీయాల్లోకి వంగవీటి రంగా వారసురాలు..?

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రభుదాస్ లేక్‌లోని టెక్రీ చౌక వద్ద గల ఘటన స్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న సోని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై హత్య కేసు (ఐపీసీ 302 సెక్షన్ కింద) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కాగా, నిందితుడు సాజన్ గతంలో తమ పొరుగున ఉన్న వారితో కూడా గొడవపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో హత్యతో పాటు, పొరుగువారితో గొడవకు సంబంధించిన మరొక కేసు కూడా సాజన్‌పై నమోదైనట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ప్రేమించి, పెళ్లి చేసుకుందామనుకున్న ఆ జంట కథ.. చీర, డబ్బుల కోసం జరిగిన చిన్న గొడవతో విషాదంగా ముగియడం స్థానికంగా కలకలం రేపింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *