Crime News: మదర్స్ డే ముందు రోజే ఓ తల్లికి కడుపుకోత మిగిలింది. తోటి చిన్నారులతో సరదాగా ఆడుకుంటున్న ఓ బాలుడ్ని బియ్యం డబ్బా బలి తీసుకుంది. తమ బిడ్డ ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లి దండ్రులు విలవిల్లాడిపోయారు. చుట్టూ వెతికారు.. కానీ ఎక్కడా ఆ బాలుడు కనిపించలేదు. చివరికి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలో వెతుకుతూనే ఉన్న సమయంలో తమ బిడ్డ బియ్యం డబ్బాలో విగతజీవిగా పడిఉండటంతో ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలోని స్థానిక అరుంధతి కాలనీలో ఉలవపూడి పవన్, సరస్వతి నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు వికాస్, వినయ్ కుమారులు. శుక్రవారం మధ్యాహ్నం చిన్న కుమారుడు వినయ్ తోటి చిన్నారులతో సరదాగా ఆడుకుంటున్నాడు. అలా ఆడుతూ.. కాసేపటికే కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు ఆ ప్రాంతం మొత్తం వెతికారు. కానీ ఎక్కడా ఆ బాలుడి ఆచూకీ లభించలేదు.
Also Read: Uttar Pradesh: యువకుడి కిడ్నాప్.. ఐదురోజుల తర్వాత కాలువలో మృతదేహం, ఏం జరిగింది ?
తోటి పిల్లల్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆపై ఇంటికి వచ్చి మళ్లి వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతున్న సమయంలో రాత్రి ఒంటిగంట టైంలో ఆ బాలుడి తల్లి డాబాపైకి వెళ్లింది. అక్కడే ఖాళీ బియ్యం డబ్బా ఆమె కాలికి గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి మూత తెరిచి చూడగా ఆ చిన్నారి బాలుడు మృతి చెంది కనిపించాడు. ఒక్కసారిగా ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
అయితే ఆడుకుంటున్న సమయంలో వినయ్ ఆ డబ్బాలో దాక్కుంటుండగా.. అది మూతపడిపోయి లాక్ అయిపోయి ఉంటుందని.. ఊపిరాడక బాలుడు చనిపోయి ఉంటాడని బంధువులు భావిస్తున్నాడు. కాగా వినయ్ వేసవి సెలవులు ఇవ్వగానే ఖమ్మం జిల్లాలోని మడుపల్లిలో ఉన్న తమ పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల క్రితమే ఆధార్ కార్డులో వివరాలు సరి చేసుకునేందుకు ఇంటికి వచ్చాడు. అలా వచ్చిన కుమారుడు.. తమకు అందనంత దూరం వెళ్లిపోయాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.