Crime News

Crime News: అక్షరాలు రాయలేదని నాలుగేళ్ల బాలుడిపై టీచర్ పైశాచికత్వం

Crime News: తల్లిలా లాలించి బుజ్జగించాల్సిన టీచరే పసిపాపపై కర్కశత్వాన్ని ప్రదర్శించిన అమానుష ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. నర్సరీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారి సరిగ్గా అక్షరాలు రాయలేదన్న కోపంతో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు ఏకంగా ఎనిమిది నిమిషాల పాటు విచక్షణారహితంగా చితకబాదింది. ఒంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులు నిలదీయగా.. సీసీటీవీ కెమెరాల్లో ఈ దారుణం బట్టబయలైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయగా, పోలీసులు సదరు టీచర్‌తో పాటు పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

అసలేం జరిగింది?..

బోథ్ మండలం కుచులాపూర్‌కు చెందిన నరేందర్ రెడ్డి కుమారుడు ముస్కు రుద్వేద్ రెడ్డి (4) బోథ్‌లోని స్థానిక ‘వేదం పాఠశాల’లో నర్సరీ చదువుతున్నాడు. గురువారం క్లాస్‌రూమ్‌లో అక్షరాలు దిద్దే క్రమంలో బాలుడు సరిగ్గా రాయలేకపోవడంతో ఉపాధ్యాయురాలు సింధూజ తీవ్ర ఆగ్రహానికి గురైంది. చిన్నపిల్లాడన్న కనికరం కూడా లేకుండా చేతులతో, కర్రతో చెంపలు, వీపు, చెవులు, తొడ భాగాలపై బలంగా కొడుతూ పిడిగుద్దులు కురిపించింది.

సీసీటీవీతో బయటపడ్డ నిజం..

బాలుడు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత విపరీతమైన నొప్పితో ఏడుస్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు పరిశీలించగా.. చెవులు, చెంపలు, వీపు భాగం ఎర్రగా కందిపోయి కనిపించాయి. దింతో తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి ప్రశ్నించగా.. మొదట తోటి విద్యార్థులే కొట్టుకున్నారని టీచర్ బుకాయించింది. అయితే క్లాస్‌రూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో దాదాపు 8 నిమిషాల పాటు బాలుడిని ఆమె చితకబాదిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు, పోలీసుల చర్యలు..

బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయురాలు సింధూజతో పాటు వేదం పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలతో కూడిన నివేదికను జిల్లా విద్యాశాఖాధికారికి (DEO) సమర్పిస్తామని మండల విద్యాశాఖాధికారి (MEO) మహమ్మద్ హుస్సేన్ వెల్లడించారు.

చిన్నారులపై ఇలాంటి శారీరక హింసకు పాల్పడే ఉపాధ్యాయులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *