Fire Accident: బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద శనివారం ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఒక బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. జెట్టీ వద్ద నిలిపి ఉంచిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానిక మత్స్యకారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో బోటులో ఉన్న మత్స్యకారులు అప్రమత్తమై ప్రాణాలు కాపాడుకోవడానికి నీటిలోకి దూకేశారు. అయితే, మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో బోటుతో పాటు లోపల ఉన్న విలువైన వలలు, ఇతర సామగ్రి పూర్తిగా బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేట కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుని సముద్రంలోకి వెళ్దామనుకుంటున్న తరుణంలోనే ఈ నిప్పు రాజకోవడం మత్స్యకార కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
