BJP:బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజాప్రతినిధులు ఢిల్లీకి పయనం కావడంపై అంతా ఆసక్తికరంగా మారింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ బాటపట్టడంపై రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆ పార్టీ అధిష్ఠానం పిలిపించుకున్నదా? లేక మూకుమ్మడిగా వెళ్లాలని నిర్ణయించుకున్నారా? అన్నది తెలియడం లేదు. అయితే రెండు విషయాలపై ఆసక్తి నెలకొన్నది.
BJP:ఇప్పటి వరకు రాష్ట్ర బీజేపీ నేతల్లో ఎవరికి వారే యమునా రీతే అన్న ధోరణిలో ఉన్నారు. ఎంపీలు ఒక తీరుగా, ఎమ్మెల్యేలు మరో తీరుగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ముఖ్య నేతలు కూడా రాష్ట్రంలోని అధికార పక్షమైన కాంగ్రెస్ వైఖరిపై అనుకూలంగా ఉండగా, మరికొందరు ముఖ్య నేతలు వ్యతిరేకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఈ దశలో పార్టీ అధిష్ఠానం వద్దకు రాష్ట్ర ముఖ్య నేతలు వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది.
BJP:ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి కేంద్ర క్యాబినెట్ మంత్రి అయ్యాక రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎవరికో ఒకరికి కట్టబెడతారని ప్రచారం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఆ పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరిని నియమించాలో అనే విషయంలో అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది ఈ దశలో ముఖ్య నేతల అభిప్రాయం తీసుకొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ప్రచారం జరుగుతున్నది.
BJP:మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల ప్రభావంతో తెలంగాణలో కూడా ఇప్పటి నుంచే పొత్తుల అంశంపై చర్చించే అవకాశం ఉన్నదని మరో ప్రచారం జరుగుతున్నది. సంకీర్ణ రాజకీయాల్లో భాగంగా పార్టీ తీసుకోవాల్సిన వైఖరిపై చర్చిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీపై పోరుబాట పట్టి ఎన్నికల నాటికి బలోపేతమయ్యే దిశగా కార్యాచరణ కోసం ప్లాన్ రచిస్తారని, ఆ దిశగా అడుగులు వేసేందుకే ముఖ్య నేతలను ఢిల్లీకి అధిష్ఠానం రప్పించుకున్నట్టు మరో ప్రచారం జరుగుతున్నది.
BJP:ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం పెద్దలు రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తున్నది. ఎవరికి వారుగా కాకుండా ఐకమత్యంగా పార్టీని నడపాలని హితబోధ చేస్తుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా పనిచేయాలని సూచించనున్నదని తెలిసింది.