Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న ఒక సిన్సియర్ అధికారి రోడ్డు ప్రమాదానికి బలికావడం తీవ్ర కలకలం రేపింది. గణపురం మండలం చెల్పూరు గ్రామంలోని ఆర్టీవో (RTO) కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఒక బొగ్గు టిప్పర్ లారీ జిల్లా రవాణా అధికారి (DTO) వెంకన్నపై నుండి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, లారీ డ్రైవర్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేవలం 15 రోజుల క్రితమే జగిత్యాల జిల్లా నుండి భూపాలపల్లికి బదిలీపై వచ్చిన డీటీవో వెంకన్న.. బాధ్యతలు స్వీకరించిన వెంటనే నిత్యం తనిఖీలు చేపట్టడంతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సుల ఫిట్నెస్ను కూడా స్వయంగా పరిశీలించి తనదైన ముద్ర వేశారు. అలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఇలా అకాల మరణం చెందడం, అలాగే ఇటీవల జరిగిన మరో ప్రమాదంలో ఇదే ఆర్టీవో ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తోన్న ఏవో (AO) రజిత సైతం తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో జిల్లా రవాణా శాఖలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ దారుణ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉన్నతాధికారి ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ.. మృతుడి కుటుంబ సభ్యులకు తన గాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తరఫున వెంకన్న కుటుంబానికి అన్ని విధాలా కొండంత అండగా ఉంటామని మంత్రి గట్టి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు వెంకన్న మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.
