Bhatti Vikramarka

Bhatti Vikramarka: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Bhatti Vikramarka: రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, అయితే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం, నిజమైన లబ్ధిదారులకు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, దీని కోసం ‘2047 విజన్ డాక్యుమెంట్’ సిద్ధం చేసినట్లు భట్టి తెలిపారు. సమాజంలో మనుషులే గొప్ప సంపద అని, వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడం ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసం విద్యారంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని, విద్యార్థులకు డైట్ మరియు కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచామని వివరించారు. నాణ్యమైన ఆహారం, మెరుగైన విద్యను అందించడం ద్వారా విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో అన్ని రకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ మొదలుకొని కింది స్థాయి అధికారుల వరకు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేసిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ఈ విషయంలో పారదర్శకత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే, అందుకు సంబంధిత అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.

చివరగా, ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. కేవలం లాభాలే ధ్యేయంగా విద్యార్థులను గదుల్లో కుక్కడం సరికాదని, ప్రతి పాఠశాల లేదా కళాశాలకు కనీస వసతులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. అనుమతులు ఇచ్చేముందు అధికారులు ఒక చెక్ లిస్ట్ పెట్టుకుని, అన్ని సౌకర్యాలు ఉన్నాయో లేదో చూశాకే అనుమతించాలని ఆదేశించారు. వసతులు లేని సంస్థలు వెంటనే తమ ప్రమాణాలను పెంచుకోవాలని, లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *