Bhatti vikramarka: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య వ్యాఖ్యలు చేశారు. శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, గ్లోబల్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక కార్యక్రమమని తెలిపారు. ప్రజా ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు ఆకర్షించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచంలోని పలు రంగాలకు చెందిన నిపుణులు, నిష్ణాతులను ఈ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు వెల్లడించారు.
తాజాగా ఎయిర్‌లైన్స్ సమస్యపై స్పందించిన భట్టి విక్రమార్క, త్వరలోనే సమస్య పరిష్కారం కావచ్చని చెప్పారు. సమ్మిట్‌కు హాజరుకానున్న ముఖ్య అతిథులకు ఏవైనా అసౌకర్యాలు ఎదురైతే, వారికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇది రాష్ట్రం గ్లోబల్ ఈవెంట్‌ను ఎంత ప్రాధాన్యంగా తీసుకుంటుందనడానికి ఉదాహరణగా పేర్కొన్నారు.
‘వన్ కంట్రీ.. మెనీ సినిమాస్’ పేరుతో వినోద పరిశ్రమపై ప్రత్యేక చర్చను ఈ సమ్మిట్‌లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మొత్తం 27 సెషన్లు జరగనున్న ఈ సమ్మిట్, ఇంత భారీ స్థాయిలో గతంలో ఎప్పుడూ నిర్వహించలేదని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు.

