Bhatti vikramarka: రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం 

Bhatti vikramarka: తెలంగాణలోని రైతుల కోసం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు వారి ఖాతాల్లో జమ చేసిన ఘట్టాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క “దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు”గా పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రైతుభరోసా విజయోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

వ్యవసాయం అంటే కాంగ్రెస్: భట్టి

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ, “దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహానుభావుడు రాజీవ్ గాంధీ. వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. రైతులకు మద్దతు ధరలు ఇచ్చింది కాంగ్రెస్, నిధులు ఇవ్వాలని అడిగింది కాంగ్రెస్, గ్రీన్ రివల్యూషన్ తెచ్చింది కూడా కాంగ్రెస్,” అని గుర్తు చేశారు.

“రైతులకు ఇప్పటికే రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని వాగ్దానం చేశాం. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఏమీ చేయలేదు. రైతు బంధు పేరిట అరకొర నిధులు మాత్రమే ఇచ్చారు. నిజమైన రైతు భరోసా అంటే ఇదే. ఈ ప్రజా ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలని కోరుతున్నా,” అని భట్టి పిలుపునిచ్చారు.

“తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు” – తుమ్మల

అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “ఇప్పుడు తెలంగాణ సంక్షోభం నుంచి సంక్షేమం వైపు వెళ్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. రాజీవ్ గాంధీ చూపిన మార్గంలో మేము ముందుకు సాగుతున్నాం,” అన్నారు.

“కొంతమంది విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ వారికీ నైతిక హక్కు లేదు. నాడు మన్మోహన్ సింగ్ రుణమాఫీ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే దారిలో సాగుతోంది. తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా నిధులు విడుదల చేశాం. పాత పథకాలు ఏవీ రద్దు చేయలేదు. గ్రామీణ తెలంగాణ మా గుండెల్లో ఉంది. ఇప్పటివరకు రైతుల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చిన ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం,” అని తుమ్మల స్పష్టం చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *