Bhakra Nangal Train: ఆ రైలులో ప్రయాణించాలంటే టికెట్ అవసరమే ఉండదు. టీసీ అసలే ఉండడు.. అంతా ఉచితం.. నిన్న మొన్నటి నుంచి కాదు.. ఏకంగా 75 ఏండ్లుగా ఈ రైలులో ఉచిత ప్రయాణ సదుపాయం ఉన్నది. ఇంత గొప్ప చరిత్ర కలిగి రైల్వే వ్యవస్థ మనదేశంలో ఏడు దశాబ్దాలకు పైగా రైలులో ఉచిత ప్రయాణం కల్పించడం విశేషమే. ఈ విషయం కొందరికి తెలిసినా, ఎందరికో తెలియాల్సి ఉన్నది. అది ఏ ప్రాంతం.. ఏ రైలో తెలుసుకుందాం రండి.
Bhakra Nangal Train:1853లో మన దేశంలో రైల్వే వ్యవస్థ ప్రారంభమై.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ముంబై నుంచి థానే వరకు తొలి రైలు ప్రయాణం మొదలైంది. ఇలా మొదలైన భారతీయ రైల్వేల్లో ప్రస్తుతం రోజూ 15 వేల కంటే ఎక్కువ రైళ్లు సుమారు 25 మిలియన్ల ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. తక్కవ ధరకే ప్రయాణికులకు ప్రజారవాణాను అందించే వ్యవస్థగా పేరుపొందింది.
Bhakra Nangal Train:ఇంతటి ఘన చరిత్ర కలిగిన రైల్వే వ్యవస్థ కలిగిన మన దేశంలోనే ఓ ప్రాంతంలో ఉచితంగా ప్రయాణికులను చేరవేసే రైలు కూడా ఉండటం విశేషం. దానిపేరే భాక్రానంగల్ రైలు. 75 ఏండ్లుగా ఈ రైలులో ప్రయాణికులు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. టికెట్ కొనాల్సిన పనే ఉండదు. ఎవరూ టికెట్ అడగరు. సేవలన్నీ ఉచితమే అన్నమాట. భాక్రనంగల్ ఆనకట్ట నిర్మాణం కోసం సామగ్రి రవాణా కోసం తొలుత ఈ రైలును వినియోగించారు. ఆ తర్వాత దానికి గుర్తుగా ఉచితంగానే ప్రయాణికులను చేరవేస్తూ నడుపుతున్నారట.
Bhakra Nangal Train:1948 నుంచి ఈ రైలు క్రమం తప్పకుండా నడుస్తున్నది. ఈ ఉచిత రైలు ప్రయాణాన్ని భాక్రా-బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు (బీబీఎంబీ) నిర్వహిస్తున్నది. గంటకు 18 నుంచి 20 గ్యాలన్ల ఇంధనాన్ని వినియోగించే ఈ రైలు సంప్రదాయాన్ని గౌరవిస్తూ నడుస్తున్నది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నడుమ 13 కిలోమీటర్ల దూరం ఈ రైలు ప్రయాణిస్తుంది. భాక్రా-నంగల్ డ్యామ్‌పై నుంచి నడిచే ఈ రైలులో ప్రయాణించడానికి సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శివాలిక్ కొండల మధ్య నడిచే ఈ రైలు నుంచి అందమైన లొకేషన్లు కనిపిస్తాయి. రోజుకు కనీసం 800 మంది వరకు ఈ రైలులో ప్రయాణిస్తారు.