Betting Apps: రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. తొలుత యూట్యూబర్లు, సినిమా స్టార్లు అయిన ఇన్‌ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేశారని బయటకొచ్చింది. అయితే గతంలో సినీ ప్రముఖులు కొందరు కూడా ఈ యాప్స్‌పై ప్రచారం చేశారన్న వార్త బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలికిపాటుకు గురైంది. ఇప్పటికే సుమారు 27 మంది ఇన్‌ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్‌లో పోలీసులు కేసులు నమోదు చేశారు.
Betting Apps: ఇదిలా ఉండగానే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై ఈడీ దృష్టి పెట్టిందని తెలిసింది. ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, వాటి లావాదేవీలు, మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా నిధులు సమకూరాయి? అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. దీంతోపాటు ఇన్‌ఫ్లుయెన్సర్లను ఒక్కొక్కరినీ పోలీసులు విచారణకు రప్పిస్తున్నారు. ఈలోగానే ఆయా ఇన్‌ఫ్లుయెన్సర్లు వీడియోల రూపంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై వివరణలు ఇచ్చుకుంటుండటం గమనార్హం.
Betting Apps: ఇదే దశలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై టాలీవుడ్‌లో కలకలం రేగడంతో ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ తాజాగా స్పందించింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల ఎందరో యువత బలవుతుందని, అలాంటి వాటిపై సినీనటులు ప్రచారం చేయడం తప్పు అని తెలుగు ఫిల్మ్ చాంబర్ తెలిపింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మా అసోసియేషన్‌కు లేఖ రాస్తామని పేర్కొన్నది. యువత చెడిపోయే వ్యవహారాలలో సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో భాగం కావద్దని సూచించింది.

