Basavaraju Saraiah

Basavaraju Saraiah: సీఎంను తిడితే ఊరుకోను.. ఫిర్యాదు చేసింది నేనే..?

Basavaraju Saraiah: తెలంగాణలో ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయాలు. కాంగ్రెస్‌లో కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ వ్యవహారం చల్లారకముందే, వరంగల్ జిల్లా రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. పదవి కోల్పోయిన అనంతరం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెను దుమారం రేపాయి. ముఖ్యమంత్రిని బ్లాక్‌మెయిల్ చేసి తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఉద్దేశించి “నీ భార్య కూడా నీకు ఓటు వేయదు” అంటూ కీలక వాఖ్యలు చేశారు.

సురేఖ వ్యాఖ్యలపై బస్వరాజు సారయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. కొండా సురేఖపై అధిష్టానానికి స్వయంగా తానే ఫిర్యాదు చేశానని బాహాటంగా ప్రకటించారు. “బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసే సంస్కృతి మీది.. మాది కాదు” అంటూ నిప్పులు చెరిగిన సారయ్య, గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ 250 మూగజీవాలను కాల్చింది ఎవరంటూ నిలదీశారు.
దమ్ముంటే రాజీనామా చేసి రా.. బరిలోకి నేనూ రెడీ!

రాజకీయ యుద్ధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ బస్వరాజు సారయ్య ఓ బహిరంగ సవాల్ విసిరారు. కొండా సురేఖకు నిజంగా దమ్ముంటే తాను రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవాలన్నారు. కావాలంటే నేను కూడా రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు.

వరంగల్ రాజకీయం ఎటువైపు?
వరంగల్ గడ్డపై కొండా కుటుంబానికి, బస్వరాజు సారయ్య వర్గానికి మధ్య ఆధిపత్య పోరు నిన్నమొన్నటిది కాదు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ రాజకీయ వైరం తాజా పరిణామాలతో పతాకస్థాయికి చేరింది. సురేఖ బర్తరఫ్, ఆపై నేతల మధ్య తలెత్తిన వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు జిల్లా కాంగ్రెస్‌ను ఏ మలుపు తిప్పుతాయోనని ఇరువర్గాల శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *