Jewellery Heist

Jewellery Heist: బంజారాహిల్స్ జ్యువెలరీ షోరూమ్‌లో కత్తితో రౌడీషీటర్ల వీరంగం..!

Jewellery Heist: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఒక జ్యువెలరీ షోరూమ్‌లోకి చొరబడిన ఇద్దరు రౌడీషీటర్లు కత్తితో సిబ్బందిని హడలెత్తించి, మద్యం మత్తులో ఉన్న ఆ దుండగులు షోరూమ్ మేనేజర్‌ను కత్తితో బెదిరించి, లక్షల రూపాయల డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసులు వెల్లడించిన మరికొన్ని వివరాల ప్రకారం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ‘శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్’  అనే షోరూమ్‌కు అలీమ్, యూనస్ అనే ఇద్దరు రౌడీషీటర్లు పూటుగా మద్యం తాగి వచ్చారు. లోపలికి ప్రవేశించడమే కాకుండా అక్కడ విధుల్లో ఉన్న షోరూమ్ మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను టార్గెట్ చేశారు. వెంటనే తమ వద్ద ఉన్న కత్తిని బయటకు తీసి, మేనేజర్ మెడపై పెట్టి భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగకుండా, “ఇప్పుడు వెళ్తున్నాం.. మళ్లీ మేము వచ్చేసరికి అడిగినంత డబ్బు రెడీగా ఉంచకపోతే చంపేస్తాం” అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ ఆకస్మిక దాడితో షాక్‌కు గురైన మేనేజర్ పంకజ్, షోరూమ్‌లోని ఇతర సిబ్బంది తీవ్ర ప్రాణభయంతో వణికిపోయారు. నిందితుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించిన మేనేజర్, వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి రౌడీషీటర్లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అత్యంత సీరియస్‌గా తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు తక్షణమే అప్రమత్తమయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ప్రత్యేక బృందాలు.. గాలింపు చర్యలు చేపట్టి నిందితులైన అలీమ్, యూనస్‌లను పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. నడిరోడ్డుపై ఉన్న పెద్ద షోరూమ్‌లోనే ఇలాంటి బెదిరింపులు జరగడం నగర వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *