Bandi Sanjay

Bandi Sanjay: హిందువులారా మేలుకోండి.. ఓటుబ్యాంకుగా మారండి.. బండి సంజయ్ పిలుపు

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో హిందూ సనాతన ధర్మ రక్షణే తన అంతిమ లక్ష్యమని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ మహత్తర కార్యాన్ని సాధించేందుకు రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ ఏకమై, శక్తివంతమైన ఓటుబ్యాంకుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు.

ఆదివారం కూకట్‌పల్లిలో కాపు కులస్తులు నిర్వహించిన కార్తీక వన భోజనాల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. హిందూ ఐక్యత, ధర్మ రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు.

జూబ్లీహిల్స్ ఫలితం ఒక హెచ్చరిక!

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాన్ని ప్రస్తావిస్తూ, ఇది రాష్ట్ర హిందువులందరికీ కనువిప్పు కావాలన్నారు. “జూబ్లిహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో ఒక కసి, మేల్కొలుపు ఏర్పడింది. అక్కడ ముస్లింలకు కొమ్ముకాసే దుస్థితిని హిందువులంతా గమనించారు” అని విమర్శించారు.

హిందువులు ఇకనైనా మేల్కొని, తమ ఓటు హక్కును ఒక ధర్మ సాధనంగా మార్చుకోవాలని, తద్వారా రాష్ట్రంలో హిందూ వ్యతిరేక శక్తుల పన్నాగాలను తిప్పికొట్టాలని సూచించారు.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: సమాజంపై చెరగని ముద్ర వేసిన మహనీయుడు రామోజీరావు

‘ఘర్ వాపసీ’కి ద్వారాలు తెరిచే ఉన్నాయి

మత మార్పిడుల అంశంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మతాన్ని మార్చుకోవడం అంటే కేవలం మనుషులను కాదు, ఏకంగా దేవుళ్లను మోసం చేసినట్లే” అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో మాయమాటలకు, మోసాలకు గురై ఇతర మతాల్లోకి వెళ్లిన వారంతా ‘ఘర్ వాపసీ’ (తిరిగి సొంత ధర్మానికి రావడం) చేయాలని ఆయన బహిరంగంగా కోరారు. హిందూ ధర్మంలోకి తిరిగి రావాలనుకునే ప్రతి ఒక్కరి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయని ప్రకటించారు. మోసపోయిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ ప్రచారం అభినందనీయం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందని బండి సంజయ్ ప్రశంసించారు.

“హిందూ సనాతన ధర్మం ప్రపంచంలోనే అత్యంత గొప్పది. హిందువుగా పుట్టడం మనందరికీ గర్వకారణం” అని పునరుద్ఘాటించారు. కార్తీక వన భోజనాలను నిర్వహిస్తున్న అన్ని కులాలకు ఆయన అభినందనలు తెలిపారు. అన్ని కులాలు తమ సామాజిక సంక్షేమానికి పాటుపడుతూనే, హిందూ ధర్మ రక్షణ కోసం కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *