Bandi Sanjay

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక టీవీ సీరియల్ లా ఉంది

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సాగుతున్న తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఈ విచారణ అంతా ఒక ముగింపు లేని టీవీ సీరియల్‌లా సాగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసు విషయంలో కేవలం నాటకాలు ఆడుతోందని, అసలైన నిందితులను పట్టుకోవడంలో వెనకాడుతోందని విమర్శించారు. తప్పు చేసిన వారిని శిక్షించాలనే పట్టుదల ప్రభుత్వానికి లేదని ఆయన ఆరోపించారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాత్రపై సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్ల కేంద్రంగా అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేయించారని, ఆయన చేసిన పనుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా కేటీఆర్ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. దేశ భద్రత కోసం చేసే ట్యాపింగ్‌కు, తెలంగాణలో జరిగిన అక్రమ ట్యాపింగ్‌కు అస్సలు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో మావోయిస్టుల పేరు చెప్పి హీరోయిన్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, చివరకు జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంజయ్ ఆరోపించారు. సిట్ (SIT) విచారణలో సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ, వారికి ప్రభుత్వం స్వేచ్ఛనివ్వడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఇప్పటివరకు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా అరెస్ట్ చేయలేకపోయారని విమర్శించారు.

ఒకవేళ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే, ఫోన్ ట్యాపింగ్‌కు బాధ్యులైన కేసీఆర్ కుటుంబ సభ్యులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేవాళ్లమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన నాయకులను, అధికారులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేవలం విచారణ పేరుతో కాలయాపన చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *