Bandi Sanjay

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కీలక ఆధారాలతో సిట్ ముందుకు బండి సంజయ్

Bandi Sanjay: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విచారణకు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని బండి సంజయ్ చేసిన ఫిర్యాదు ఆధారంగా సిట్ అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఖైరతాబాద్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో ఉన్న సిట్ కార్యాలయానికి బయలుదేరారు.

విచారణకు హాజరైన బృందం
బండి సంజయ్‌తో పాటు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సమాచారం ఉన్నట్లు భావిస్తున్న ఆయన బృందం సభ్యులు కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.

బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ (కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్)

పసునూరు మధు (పీఆర్వో)

పోగుల తిరుపతి (మాజీ పీఏ)

Also Read: Sri Lanka: శ్రీలంక చెర‌లో 68 మంది భార‌త జాల‌ర్లు..235 ప‌డ‌వ‌లు

ఆధారాలు సమర్పించనున్న బండి సంజయ్ :
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌తో పాటు పలువురు బీజేపీ నాయకుల ఫోన్‌లను కూడా అత్యధికంగా ట్యాప్ చేశారని కేంద్ర నిఘా వర్గాలు నిర్ధారించాయి. ఈ ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు ఆయన కుమారుడు కేటీఆర్ పాత్రపై కూడా కేంద్ర నిఘా వర్గాలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈ ఆధారాలను బండి సంజయ్ సిట్ అధికారులకు సమర్పించనున్నారు.

ఈ కేసులో ఇప్పటికే మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు వంటివారు కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ ఎదుట అంగీకరించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సమర్పించబోయే ఆధారాలు కేసులో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జడ్జీలు, భార్యభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేయడంపై బీజేపీ అధిష్టానం తీవ్రంగా స్పందించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *