Balmoor Venkat: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ అధికారులు పిలిస్తే.. ఆయన తెలంగాణ జాతిపితలా మాట్లాడుతున్నారని వెంకట్ ఎద్దేవా చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తమను మాత్రం విచారణ చేయవద్దని చట్టంలో ఎక్కడా లేదని ఆయన హితవు పలికారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఎంతో మంది ఫోన్లు ట్యాప్ చేశారని వెంకట్ ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు, తన కుటుంబ సభ్యులు, చివరకు తన ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌ను కూడా వదలలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న కారణంతోనే, వివరాలు సేకరించేందుకు ఇప్పుడు సిట్ అధికారులు తనను కూడా విచారణకు పిలిచారని ఆయన స్పష్టం చేశారు.
గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తనపై అత్యధిక కేసులు బనాయించిందని బల్మూరి వెంకట్ గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్‌లోకి పోలీసులు వచ్చి మరీ తనను అరెస్ట్ చేసిన రోజులను ఆయన ప్రస్తావించారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని, ఇప్పుడు మాత్రం నీతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న అవినీతి ఆరోపణలపైనా వెంకట్ ఘాటుగా స్పందించారు. కేవలం ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం ఏముందని, చట్టపరమైన విచారణకు సహకరించాలని ఆయన బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు.
