Venu Yeldandi: ఫస్ట్ సినిమా సూపర్ హిట్. అయినా సెకండ్ సినిమా కష్టాలు ఇంకా తీరలేదు. నిన్నటి వరకూ నాని హీరో అన్నారు. ఆ తర్వాత తూచ్ నాని కాదు నితిన్ అని వినిపించింది. ఇప్పుడు వారిద్దరూ కాదట. ‘హనుమాన్’ ఫేమ్ తేజ సజ్జ అంటున్నారు. ఇవి ‘బలగం’ వేణు తిప్పలు. నటుడుగా పడుతూ లేస్తూ సాగిన వేణు జబర్ దస్త్ తో బాగా సెటిల్ అయ్యాడు. అయితే దర్శకుడుగా మాత్రం తొలి సినిమాతోనే బంపర్ హిట్ కొట్టాడు. రెండో సినిమా నాని హీరోగా అని వినిపించింది. టైటిల్ కూడా ‘ఎల్లమ్మ’ అని ప్రకటించారు. నిర్మాణపరంగా ఇబ్బందులు లేని బ్యానర్. దాంతో ఇక వేణు లైఫ్ నల్లేరు బండి మీద నడకే అని బావించారందరూ. కానీ అది నిజం కాదని తేలింది. తెలియని కారణాలతో నాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత నితిన్ హీరో అని రావటంతో పర్వాలేదు ఓకె అనుకున్నారు. అదీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు యంగ్ హీరో తేజ సజ్జ పేరు వినపడుతోంది. అదీ ఒకందుకు మంచిదే. ఎందుకంటే నితిన్ వరుస ప్లాప్స్ లో ఉన్నాడు. తేజ ‘హనుమాన్’తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. కథ కూడా తేజకు నచ్చిందట. నిర్మాత దిల్ రాజు అధికారికంగా తేజతో చేస్తున్నామని త్వరలో ప్రకటిస్తాడంటున్నారు. సో ఈ సారైనా సెకండ్ హార్డిల్ పై వేణు అడుగు పడుతుందేమో చూడాలి.
