Vishaka YCP Arachakam: ప్రశాంతతకు మారు పేరైన విశాఖలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా రెచ్చిపోయిన వైసీపీ నాయకులు మళ్లీ ఇప్పుడు ధర్నాల పేరుతో అరాచకాలను సృష్టిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి, విశాఖ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంటే.. మరోవైపు వైసీపీ నేతలు పోలీసులపై దాడులు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ మెప్పు కోసం చాలా మంది నేతలు అప్పటి ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై, నేతలపై నేరుగా దాడులు చేసేవారు. ఇప్పుడు మళ్లీ కేకే రాజు జిల్లా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత.. రౌడీ మూకలను రంగంలోకి దింపి విశాఖలో లేని కొత్త సంస్కృతికి తెర లేపారని టాక్ నడుస్తోంది.
గతంతో పోల్చుకుంటే ఉత్తరాంధ్రలో వైసీపీ రోజురోజుకీ క్షీణిస్తోంది. ముఖ్యంగా విశాఖలో వైసీపీకి సరైన నాయకుడు లేక పార్టీ పూర్తిగా డీలా పడింది. జిల్లా అధ్యక్ష పదవిలో సైతం రెండు సార్లు ఘోర ఓటమి చవిచూసిన కేకే రాజుని నియమించారంటే విశాఖలో పార్టీ పరిస్థితి అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదిలా ఉంటే ఫీజు పోరు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది వైసీపీ. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలు అన్నాక సహజంగానే ప్రభుత్వ విధానాలపై పోరాటాలు చేస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ప్రస్తుతం వైసీపీ అనుసరిస్తున్న విధానం చూస్తుంటే శాంతి భద్రతల సమస్యలు సృష్టించి, అరాచకాలు సృష్టించడమే ఆ పార్టీ వ్యూహంలా కనబడుతోందంటున్నారు స్థానికులు. దానికి ప్రధాన కారణం ధర్నాల పేర్లతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక దగ్గరికి చేరుకుని పోలీసుల ఆంక్షలు సైతం లెక్కచేయకుండా పోలీసులపై దౌర్జన్యం చేస్తూ అరాచకంగా ప్రవర్తించడమే అంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.
Also Read: Train Ticket Hike: పెరగనున్న రైలు ఛార్జీలు.. జూలై నుండి అమలు
Vishaka YCP Arachakam: 2020 ఫిబ్రవరి 27న అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును విశాఖ విమానాశ్రయంలో కేకే రాజు ఆధ్వర్యంలో రౌడీలు అడ్డుకున్నారు. ఈ దాడికి నేతృత్వం వహించింది కూడా కేకే రాజే అని కూటమి నేతలు ఆరోపిస్తుంటారు. అప్పట్లో ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది. అప్పటి ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై రెండు కేసులు కూడా నమోదు చేసినప్పటికీ ఈ దాడికి నేతృత్వం వహించిన కేకే రాజు, ఆయన అనుచరులను నిందితులుగా చేర్చలేదు. వైసీపీ అధికారంలో ఉండడంతో దర్యాప్తు చేయకుండానే కేసు మూసేశారు. అప్పట్లో విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న కేకే రాజు, తన రౌడీ మూకలతో కలిసి చంద్రబాబు కారును అడ్డుకుని, దాడికి ప్రయత్నించడంపై ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడంపై టీడీపీ నేతలలోనే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా చంద్రబాబుపై దాడి చేస్తే.. ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో కేకే రాజు మరింత రెచ్చపోతున్నారట. నూతనంగా వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుగా నియమితులైన కేకే రాజు తన పంథా మళ్లీ ప్రారంభించారట. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కేకే రాజు అండ్ టీం పై చర్యలు తీసుకుంటుందో, అలాగే చూస్తూ వదిలేస్తుందో అంటూ కూటమి నాయకులు చర్చించుకుంటున్నారు.