TDP Incharge Satyavedu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ అధిష్టానం తీసుకున్న ఆ నిర్ణయం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నచోట ఇంఛార్జ్‌ను నియమించడం ఆసక్తికరంగా మారింది. పేరుకు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అని చెబుతున్నా నియోజకవర్గ పగ్గాలు ఆయనకే అప్పగించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గురించే ఈ చర్చంతా. కూరపాటి శంకర్ రెడ్డి తిరుపతికి చెందిన పారిశ్రామికవేత్త, ఆయన గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా కుదరలేదు. దీంతో తిరుపతి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. తిరుపతి జిల్లా రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా మారిన శంకర్ రెడ్డి… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల దృష్టిని ఆకర్షించారు. అందుకే ఆయనకు సత్యవేడు బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గతేడాది ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీడీపీ అధిష్టానం ప్రకటించింది. అప్పటి నుంచి అనాథలా మారిన సత్యవేడు సైకిల్ క్యాడర్‌కు శంకర్ రెడ్డి రాకతో మళ్లీ ఊపొచ్చింది.
సత్యవేడు టీడీపీ కో-ఆర్డినేటర్‌గా శంకర్ రెడ్డి నియమకంతో ఆ పార్టీ కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. మొన్నటివరకు వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలకే సత్యవేడులో రెడ్ కార్పెట్ పరిచారని ప్రజలు బాహాటంగానే చర్చించుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 16 నెలలు గడిచినా.. సత్యవేడులో తెలుగు తమ్ముళ్లకు ఎక్కడ కూడా మర్యాద దక్కలేదనే టాక్ నడిచింది. మురోపక్క ఉమ్మడి చిత్తూరు జిల్లా మొత్తానికి సత్యవేడు నియోజవర్గం నుంచే అత్యధికంగా గ్రావెల్, ఇసుక పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళేవి. ఇవన్నీ కూడా గతంలో పెత్తనం చెలాయించిన వైసీపీ నేతల కనుసైగల్లోనే మొన్నటి వరకు నడిచేవి. అయితే తాజాగా సత్యవేడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేష్ గమనించడమే కాకుండా సత్యవేడుకు టిడిపి కోఆర్డినేటర్‌గా శంకర్ రెడ్డిని నియమించడంతో.. సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లయింది.
Also Read: Murmu: రాఫెల్ ఫైటర్ జెట్‌లో 30 నిమిషాల పాటు విహరించిన రాష్ట్రపతి
కోఆర్డినేటర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే శంకర్ రెడ్డి ముందుగా సత్యవేడులో గ్రావెల్, ఇసుక మాఫియాకు చెక్ పెట్టారు. ప్రజల నిత్యవసరాలకు మాత్రమే గ్రావెల్, ఇసుకను వినియోగించుకోవాలని, వాటి వరకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని అధికారులకు గట్టిగా సూచించడం ప్రజలందరూ స్వాగతించారు. అంతేకాదు.. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, వారికి పదవులు కట్టబెట్టేందుకు శంకర్ రెడ్డి సిద్ధమయ్యారు. సైలెంట్‌గానే గత మూడు నెలలుగా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు శంకర్ రెడ్డి. సత్యవేడు నియోజకవర్గంలో అసలైన టీడీపీ కార్యకర్తలను గుర్తించే పనిలో పడటమే కాకుండా, వారిని తన దగ్గరకు పిలిపించుకుని మరీ.. వారి సమస్యలను పరిష్కరిస్తుండటం గమనార్హం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పార్టీ తరపున లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఒక్కసారిగా సత్యవేడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు మళ్లీ జోష్‌లోకి వచ్చేశారు. శంకర్ రెడ్డి వచ్చాక కుల మతాలకు అతీతంగా అందర్నీ కలుపుకొని పోతూ, సత్యవేడు నియోజకవర్గంలో పార్టీని అన్ని విధాలా కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తోంది టీడీపీ క్యాడర్.
అయితే ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన గ్రావెల్ మాఫియాకి చెక్ పెట్టడంతో సోషల్ మీడియా వేదికగా ఓ వర్గం శంకర్ రెడ్డిని టార్గెట్ చేసిందట. ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ, పార్టీ అధినేతలకు పితూరీలు ఎక్కించే విధంగా వైసీపీతో చేతులు కలిపిన టీడీపీ నేతల ద్వారా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. స్వతహాగా బడా కాంట్రాక్టర్ అయిన శంకర్ రెడ్డికి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. పార్టీపై అభిమానం, ప్రేమతో… అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ ఆదేశాలకు కట్టుబడి సత్యవేడులో టీడీపీని గాడిన పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాంటి ఫలితం ఆశించకుండా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, సత్యవేడు ప్రజల బాగోగులు చూస్తూ, అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అటువంటి శంకర్ రెడ్డిపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. బద్ధలు కొట్టడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తూ, శంకర్ రెడ్డికి అండగా నిలబుతోంది తెలుగుదేశం యువ సైన్యం.

