Tanuku MLA Arimilli APP: కూటమి పాలన ఏడాది పూర్తయింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు ఈ ఏడాదిలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఫోకస్ పెట్టారు. తమ పని తీరుతో నిత్యం ప్రజల్లో మెలిగిన ఎమ్మెల్యేలు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తుంటే, అక్కడక్కడా పలువురు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత కూడా కనిపిస్తోందని సర్వేల్లో వెల్లడవుతోంది. ఈ నేపథ్యంలో తన ఏడాది పాలనకు మార్కులు వేయమని ఆ ఎమ్మెల్యే నేరుగా ప్రజల్నే అడుగుతున్నారు. ఏడాదిలో సంక్షేమం, అభివృద్ధి కలయికతో నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి తోడ్పాటు అందించానని, మరింతగా సేవలందించేందుకు సలహాలు సూచనలతో పాటూ మీ ఫిర్యాదులు కూడా నేరుగా తనతోనే పంచుకోమంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఆయనే తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ.
వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి… ‘మన మిత్ర’ యాప్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారంలో సాంకేతికను జోడించిన టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో.. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఓ అద్భుత ఆలోచన చేశారు. మన ఎమ్మెల్యే, మన నియోజకవర్గం…. మీ సమస్య, నా పరిష్కారం అంటూ… వాట్సాప్‌కు అనుసంధానంగా ఓ ప్రత్యేక యాప్ తీసుకొచ్చి.. దాని ద్వారా తన నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చేలా వేదికను కల్పించారు. ఈ యాప్‌లో తణుకు నియోజవర్గంలో 45 గ్రామాలను చేర్చారు. వ్యవసాయం, కాలువలు, విద్య, విద్యుత్, హౌసింగ్, నీటిపారుదల సమస్య ఏదైనా ఫిర్యాదు చేయొచ్చు. మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, ఇతర ఏ అధికారినైనా సరే… వారి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా నేరుగా ఫోన్ నుండే ఫిర్యాదు చేయొచ్చు. ఆ ఫిర్యాదులన్నీ ఎమ్మెల్యే దృష్టికి చేరతాయి కాబట్టి.. అధికారుల స్పందన, సమస్యల సత్వర పరిష్కారంపై ఎమ్మెల్యే పర్యవేక్షణ ఉంటుంది. ఉదాహరణకు పలానా ప్రాంతంలో పంట కాలువలో పూడిక తీయించమంటూ ఫొటోలతో సహా ఫిర్యాదు చేయొచ్చు. ఆ ప్రాంతం యొక్క లొకేషన్‌ని జత చేయొచ్చు. చెప్పిన టైంలో సమస్య పరిష్కారం కాకుంటే.. తిరిగి ప్రశ్నించేందుకు వీలుగా ప్రతి ఫిర్యాదుకు రెఫరెన్స్ నంబర్ కేటాయిస్తారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఈ యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే అరిమిల్లి పేర్కొన్నారు.
Also Read: Meena: బీజేపీలో చేరనున్న ప్రముఖ నటి మీనా?
Tanuku MLA Arimilli APP: “సమస్య మీది — పరిష్కారం నాది. See it. Say it. Solve it. మీ వీధిలో సమస్యలా? మీ ఊర్లో నిర్లక్ష్యమా? ఇంకా ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్య, నేరుగా మీ ఎమ్మెల్యే దృష్టికి తెండి. మీ కోసం ఓ కొత్త మార్గం — మీ సమస్య — నా పరిష్కారం అనే ఈ వినూత్న ప్రయోగం.” అంటూ మీడియా, సోషల్‌మీడియాలో ప్రమోషన్ కూడా ఎమ్మెల్యేనే చేస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే అరిమిల్లి చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం… రాష్ట్ర రాజకీయ వర్గాలను ఆకట్టుకుంటోంది. దీంతో మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అరిమిల్లిని ఫాలో అయినా ఆశ్చర్యం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.