Talliki Vandanam: ‘తల్లికి వందనం’ అమలుతో కూటమి సర్కార్ వైసీపీకి చెమటలు పట్టించింది. జగన్ రెడ్డి వెక్కిరింతలకు, ఏడాదిగా విర్రవీగుతున్న వైసీపీకి నడ్డి విరిచే సమాధానం ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. తల్లిని, చెల్లిని మెడపట్టి కోర్టుకు ఈడ్చిన వ్యక్తికి ‘తల్లికి వందనం’ అంటే వెటకారం కాక మరేమవుతుంది? అందుకే… అమ్మఒడి అంటూ.. ప్రతి ఇంట్లో ఇద్దరు పిల్లల చదువుకు.. ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు. తల్లుల్ని ఇలా వంచించిన జగన్‌కు.. చెప్పాలంటే ఈ పథకం గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే.. పథకం అమలు కాలేదంటూ రోడ్డెక్కి… “నీకు 15 వేలు, నీకు 15 వేలు” అంటూ వైసీపీ నేతలు హేళన సాగించారు. సాక్షాత్తూ జగన్ మోహన్‌రెడ్డి సైతం ఈ అవహేళనకు పాల్పడ్డారు.
అయితే సీఎం చంద్రబాబు నాయుడు అప్పుడు నోరు మెదపలేదు. కానీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకంతో జగన్ గుండెల్లో గునపం దించారు. 8,745 కోట్ల రూపాయలను 67,27,164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తూ, వైసీపీ దుష్ప్రచారాన్ని చిత్తు చేశారు.
జగన్ హయాంలో అమ్మఒడి పథకం అస్తవ్యస్తంగా సాగింది. ఒక్క పిల్లాడికే సాయం అందింది. అదీ అవకతవకలతో ఉండేది! హామీ ఇచ్చిన డబ్బులో సగం కూడా తల్లులకు చేరలేదు. కానీ, చంద్రబాబు నాయుడు హామీ మేరకు ఇంట్లో అర్హత ఉన్న ప్రతి పిల్లాడికీ 15 వేలు అందిస్తున్నారు. జగన్ ఐదేళ్లలో 3 వేలు పెన్షన్ ఇవ్వడానికి గడబిడలాడాడు. దాన్నే గొప్పగా చెప్పుకున్నాడు. కానీ, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ 4 వేలకు పెంచి ప్రజల మనసులు గెలిచారు. అయినా, వైసీపీ నోట్లో నుంచి మెచ్చుకోలు రాలేదు. ఇక తల్లికి వందనం పథకం విషయానికొస్తే… కూటమి సర్కారు అప్పుల భారంతో ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయలేదని జగన్ గట్టిగా నమ్మాడు. అందుకే ఆ రకంగా విచిత్ర హావభావాలతో ఇష్టానుసారం పేలాడు. కానీ, సీఎం చంద్రబాబు.. జగన్ నమ్మకాన్ని చిత్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంకా పూర్తిగా గాడిలో పడకున్నా.. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేయడం ద్వారా… కూటమి ప్రభుత్వం తమ సంకల్పాన్ని చాటింది.
Talliki Vandanam: ఇక, టీడీపీ సీనియర్ నేత, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రివర్స్ ర్యాగింగ్‌కు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో “నీకు 15 వేలు, నీకు 15 వేలు” అంటూ నిమ్మల చేసిన లయబద్ధ ప్రచారం జనంలో జోష్ నింపింది. ఇలా సూపర్ సిక్స్ హామీలను గ్రామగ్రామాన జనంలోకి తీసుకెళ్లిన నిమ్మల, కూటమి అఖండ విజయానికి తన వంతు పాత్ర పోషించారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక… వైసీపీ శ్రేణులు నిమ్మలను అవహేళన చేస్తూ, “తల్లికి వందనం ఎప్పుడు?” అంటూ రెచ్చిపోయారు. జగన్ స్వయంగా “నీకు 15 వేలు.. నీకు 15 వేలు” అంటూ కూటమిని ఎద్దేవా చేసిన వీడియో వైరల్ అయింది. ఇప్పుడు బంతి నిమ్మల కోర్టులోకి వచ్చింది. ఈ పథకం అమలుతో వైసీపీ నోళ్లకు తాళం పడటం ఖాయం. ఇక నిమ్మల వైసీపీపై రివర్స్ ర్యాగింగ్ మొదలుపెడితే, ఘోర పరాజయంతో బిక్క చచ్చిపోయిన వైసీపీ.. ఆ దెబ్బను తట్టుకోవడం కష్టమే అంటున్నారు పరిశీలకులు. ఏది ఏమైనా… ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం కార్యక్రమానికి జగనే బ్రాండ్ అంబాసిడర్.

