Sunil Yadav Murder Case: వివేకా హత్య కేసులో ఏ2 ఉన్న సునీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఆ కేసులో కీలకంగా మారారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే 5 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పులివెందుల పోలీసులు. ఏ1 ఉన్న పవన్ కుమార్ అనే వ్యక్తి ఎంపీ అవినాష్ రెడ్డి సోషల్ మీడియా గ్రూప్ అడ్మిన్. పవన్ కుమార్‌పై కేసు నమోదు అయ్యాక.. జగన్ ఏకంగా అతగాడికి డీఎస్పీతో సెల్యూట్ చేయిస్తానన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ కేసు అనంతరం పవన్ కుమార్‌ను పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నియమించింది వైసీపీ. అలా ఎంపీ అనుచరుడు పవన్ కుమార్ ఆగడాలకు వైసీపీ మరింత ఆజ్యం పోసిందనడంలో సందేహమే లేదు. నేడు ఆ పవన్ కుమార్ అనే వ్యక్తి నిరంతరం సునీల్ కుమార్ యాదవ్‌పై రెక్కీ నిర్వహించడం, సునీల్ కుమార్ యాదవ్ సొంత గ్రామంలోని వైసీపీ నేతలతో టచ్‌లో ఉంటూ ఉండటమే ఇప్పుడు ప్రధానంగా ఆలోచించదగ్గ విషయం.
వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఇప్పటికే షర్మిల, వివేకా కూతురు సునీత…. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితని, ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఇప్పటికే హత్య కేసులో ఉన్న ఒక్కొక్కరు మృత్యువాత పడుతుండడంతో అనుమానాలు రెట్టింపు అయ్యాయి. ఈ క్రమంలో వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్ రెడ్డిలకు ఎదురుతిరిగిన ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు వివేకా హత్య కేసులో కీలకంగా మారారు. వివేకాని సునీల్ కుమార్ యాదవ్‌తో కలిసి.. వివేకా కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలే హత్య చేయించారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాడు ఎంపీ అనుచరుడు పవన్ కుమార్. తనపై కేసు నమోదైనా అతనికి ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నది వాస్తవం. వివేకా హత్య కేసు నిందితులకు శిక్ష పడాలంటే కచ్చితంగా సునీల్ కుమార్ యాదవ్ కీలకం కానున్నారు. ఇప్పటికే తనకు ప్రాణహాని ఉందని చెప్పిన సునీల్ కుమార్ యాదవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఎస్పీ సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఉంది.
Also Read: YCP Stories on Singayya Case: దేనికైనా 10 ప్రశ్నలే..! ఆ క్రియేటివిటికీ ఎవరైనా ఫిదా కావాల్సిందే..!
Sunil Yadav Murder Case: సునీల్ కుమార్ యాదవ్ కుటుంబంపై రెక్కీ నిర్వహించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు పులివెందుల పోలీసులు. పవన్ కుమార్, లోకేష్ రెడ్డిలతో పాటు మరో వ్యక్తిపైనా కేసు నమోదైంది. జైల్లో ఉన్నప్పుడు కూడా తనను బెదిరించారని సునీల్ కుమార్ యాదవ్ పలుమార్లు మీడియా ముందు చెప్పారు. తాను మాట్లాడే విషయాలు కొందరికి నచ్చడం లేదని, వైసీపీ పెద్దల నుంచి తనకు ప్రాణహాన్ని ఉందని సునీల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ పరిణామాలతో సునీల్ కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు కూడా భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే రెక్కి నిర్వహించిన ముగ్గురికి కూడా పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చి పంపించి వేయడం ఇక్కడ కొసమెరుపు.
వివేకా హత్య కేసులో ఏ2 సునీల్ కుమార్ యాదవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఎస్పీ భద్రత కల్పించాల్సిన అవసరం కనబడుతోంది. స్టేషన్ బెయిల్‌పై బయటికి వచ్చిన ఎంపీ అనుచరులతో కచ్చితంగా తనకి ప్రాణానికి హాని ఉందని సునీల్ కుమార్ యాదవ్ వాపోతున్నాడు. పవన్ కుమార్ ద్వారా సునీల్ కుమార్ యాదవ్‌ను అడ్డు తొలిగించుకునేందుకు కుట్రలు పన్నుతున్నారా అన్న సందేహమూ లేకపోలేదు. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న సాక్షులు, నిందితులు వరుసగా అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. వాచ్‌మెన్ రంగయ్య కూడా అలాగే ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు దస్తగిరి వంతా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి పులివెందుల ప్రజల్లో.