Senani Sandesham: “దశాబ్ధకాలం సినిమాలపై దృష్టి సారించలేకపోయా. జనసేనతోనే కొనసాగా. ఫలితంగా ఈ రికార్డు విజయం. కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలను. పడతాను, లేస్తాను. కానీ పోరాటం ఆపను. కార్యకర్తల మాటలు వినాలనే అందరినీ పిలిచాం. కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. దేశమంతా మన పార్టీ గురించి మాట్లాడాలనుకున్నా. దానికి తగ్గట్టే వ్యూహం రచించుకున్నా. ఐడియాలజీ ఉండాలి. కానీ అదొక్కటే సరిపోదు. సరైన వ్యూహం కావాలి. 7 సిద్ధాంతాలతో మన పార్టీ ఐడియాలజీని ప్రకటిస్తే.. చాలా మంది అపహాస్యం చేశారు. నమ్మలేదు. వంద పర్సెంట్ స్ట్రయిక్ రేట్‌తో కొట్టి చూపించాం కదా. ఇప్పుడు నమ్ముతారు నన్ను. కానీ ఆనాడు నా దగ్గర ఏమీ లేనప్పుడు.. నమ్మి నా వెంట నడిచింది మీరే. జనసైనికులు, వీరమహిళలే. కమ్యూనిజాన్ని నమ్మిన రష్యా ఏమైంది? ప్రపంచ కార్మికులారా ఏకం కండి… ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. అంటూ గొంతు చించుకుని అరిచారు కదా. మార్పు తీసుకురాగలిగారా? అందుకే అంటున్నా.. ఐడియాలజీతో పాటూ ప్రాక్టికాలిటీ ఉండాలని. వ్యక్తి మొదట వ్యవస్థని సృష్టిస్తాడు. తర్వాత ఆ వ్యవస్థ వ్యక్తులను నడిపిస్తుంది.
సిద్ధాంతాలు, భావజాలాలు తెలుసుకోకుండానే, అన్నింటినీ ఆకలింపు చేసుకోకుండానే పార్టీ పెడతానా నేను? అన్నీ ఆలోచించే అడుగేశాను. నేను క్లారిటీతో ఉన్నాను. అందుకే సలహాలు ఇచ్చే వాళ్లు కాదు, కలిసి నడిచేవాళ్లు కావాలన్నా. నన్ను నమ్మి మీరంతా నా వెంటొచ్చారు. అధికారం ఉన్నా కాంట్రాక్టులు తీసుకోలేదు. పార్టీని నడిపేందుకు నాకు సినిమాలే ఆధారం. ఇకపై పార్టీని ఆఫీస్ నుంచి స్వయంగా నేనే మానిటర్ చేస్తాను. రోజుకు నాలుగు గంటలు పార్టీ కోసమే కేటాయిస్తాను. మన కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నాను. మీకేం కావాలో తెలుసుకున్నాను. మీ కోసమే వచ్చే దసరా తర్వాత పార్టీలో త్రిశూల్ వ్యూహం అమలవబోతోంది. కార్యకర్తల్ని కాపాడుకుంటాం. నాకొక పదేళ్లు సమయం ఇవ్వండి. మిమ్మల్ని గ్రాస్‌రూట్ లెవల్ నుండి జాతీయ స్థాయి నాయకులుగా తయారు చేసే బాధ్యత నాది. గుర్తింపు, నాయకత్వం, భద్రత.. అనే మూడు అంశాలతో ‘త్రిశూల్’ అమలు చేయబోతున్నాం. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీకి పనిచేసే కార్యకర్తల్ని ప్రత్యేక ఐడీతో గుర్తిస్తాం. స్టెప్ బై స్టెప్ వారిని నాయకులుగా తీర్చిదిద్దుతాం. పార్టీ కోసం నిలబడిన ప్రతి జనసైనికుడు, ప్రతి వీరమహిళ భద్రత కూడా పార్టీనే చూసుకునేలా విధి విధానాలు రూపొందించబోతున్నాం.” ఇదీ…. క్లుప్తంగా సేనకు సేనాని ఇచ్చిన సందేశం.
Also Read: Pawan Kalyan: అభివృద్ధిపై మీ అంకితభావం.. భవిష్యత్తు తరాలకు మార్గదర్శిగా నిలుస్తుంది
Senani Sandesham: విశాఖలో మూడ్రోజుల పాటు సాగిన‘సేనతో సేనాని’ విస్తృత స్థాయి సమావేశం… ఇప్పటిదాకా జనసేన నిర్వహించిన అత్యంత శక్తివంతమైన రాజకీయ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సమావేశం జనసేన అధినేత దీర్ఘకాల విజన్‌ను, నిబద్ధతను, కార్యకర్తలతో అతని బంధాన్ని స్పష్టంగా ప్రతిబింబించింది. ఇది జనసేన సైద్ధాంతిక బలాన్ని, ప్రజల కోసం పోరాడే సంకల్పాన్ని, భవిష్యత్ లక్ష్యాలను పునర్వ్యవస్థీకరించే ఒక కీలక ములుపులా పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రసంగం తీరు కూడా ఈ సారి కొత్తగా, రిఫ్రెషింగ్‌గా ఉందని అనలిస్టులు అంటున్నారు. పవన్ ప్రసంగం కార్యకర్తల గుండెల్లో సంకల్పాన్ని రగిలించింది. “జనసేన ఒక రోజు జాతీయ పార్టీగా ఎదుగుతుంది. కానీ అది క్రమంగా, ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, కష్టపడి సాధించాలి, సైద్ధాంతిక బలంతో, ఐక్యత, క్రమశిక్షణతో ముందుకు సాగాలి” అని సేనాని ఇచ్చిన సందేశం కార్యకర్తలకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. కార్యకర్తల కోసం పవన్ ప్రకటించిన త్రిశూల్ అనే కొత్త కార్యక్రమం… దేశంలోనే రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక గేమ్ ఛేంజర్ కాబోతోంది. అలాగే, మహిళలను రాజకీయంలో బలమైన నాయకులుగా తీర్చిదిద్దాలనే ఆయన పిలుపు, ముఖ్యంగా ఆడపడుచులలో స్ఫూర్తిని నింపింది.
పవన్ ప్రసంగం కార్యకర్తలలో అపూర్వమైన ధైర్యాన్ని నింపింది. ఆయన తన 12 ఏళ్ల పోరాటంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, విమర్శలను, బెదిరింపులను గుర్తు చేస్తూ, “మనం 100% స్ట్రైక్ రేట్‌తో అన్ని సీట్లు గెలిచాము,” అని గర్వంగా చెప్పారు. ఈ మాటలు కార్యకర్తలకు తమ కష్టం వృథా కాలేదని, తమ నమ్మకం సఫలమైందని గట్టి నమ్మకాన్ని కలిగించాయి. మొత్తంగా..‘సేనతో సేనాని’ సమావేశం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఒక మైలురాయిగా చెప్పొచ్చు. ఈ కార్యక్రమం నాయకులకు, కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణకు ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించింది. జనసేన రాజకీయ ప్రయాణంలో ఒక కీలకమైన అధ్యాయంగా నిలిచిందీ సమావేశం. పవన్ కళ్యాణ్ యొక్క ప్రసంగం కేవలం రాజకీయ వ్యూహాల గురించి మాత్రమే కాకుండా.. సమాజాన్ని ఏకం చేయాలనే, కుల రాజకీయాలను అధిగమించాలనే, ప్రజలకు న్యాయం చేయాలనే ఆకాంక్షను ప్రతిబింబించింది. ‘త్రిశూల్’ కార్యక్రమం ద్వారా గ్రాస్‌రూట్ నాయకత్వాన్ని పెంపొందించాలనే ఆయన నిర్ణయం, జనసేన భవిష్యత్ వృద్ధికి ఒక బలమైన పునాదిని వేయనుంది.