Pulivendula: గత వైసీపీ ప్రభుత్వంలో కడప జిల్లాలో ఆయనో మోస్ట్ టార్గెటెడ్ లీడర్. అప్పుడు, ఇప్పుడు.. ఆ ఎమ్మెల్యే ఏమి మాట్లాడినా సంచలనమే. సొంత నియోజకవర్గంలోనే కాదు.. ఉమ్మడి కడప జిల్లాలో ఆయన ఎక్కడికెళ్లినా, ఏం చేసినా, నా రూటే సెపరేటు అనేలా చేస్తుంటారు. ఆయన మరెవరో కాదు, జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ధీటుగా ఢీకొట్టిన ఆది.. కడప జిల్లా రాజకీయాల్లో తన పేరును ఒక బ్రాండ్‌లా మార్చుకున్నారు. ఇప్పుడాయన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్బంగా పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లిన ఆది.. వివేకా కుమార్తె సునీతను పరామర్శించారు. అసెంబ్లీ ఎన్నికను మించిన పోరును తలపిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో… వివేకా కుటుంబంతో ఎమ్మెల్యే ఆది భేటీ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వివేకా హత్యలో ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉందని వైఎస్ అవినాష్, వైఎస్ జగన్‌లు కలిసి వివేకా కూతురు సునీతను నమ్మించాలని చేసిన ప్రయత్నం కాస్తా విఫలం అయ్యింది. వైసీపీ కుట్రలను తిప్పి కొట్టిన ఆదినారాయణ రెడ్డి… వివేకా హత్య కేసులో తన ప్రమేయం ఉందంటే బహిరంగంగా ఉరి తీయాలని వైసీపీకి సవాల్ విసిరారు. ఇప్పుడు అదే వివేకా ఇంటికెళ్లి, సునీతతో భేటీ తర్వాత ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్, అవినాష్ డైరెక్షన్‌లోనే వివేకా హత్య జరిగిందన్నారు ఆది. అంతే కాకుండా తనను అంతమొందించాలని కూడా కుట్ర పన్నారన్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసు త్వరిత గతిన పూర్తి చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రిని కోరానన్నారు.
Also Read: Dhulipalla vs Agnyathavasi: ధూళిపాళ్లపై వస్తున్న ఆరోపణల వెనుక అజ్ఞాతవాసి
జమ్మలమడుగు ఫైర్ బ్రాండ్ ఆదినారాయణ రెడ్డి.. పులివెందులలో వైసీపీ కుట్రలకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. పులివెందులలోనే మకాం వేశారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి గెలుపే తన టార్గెట్ అంటున్నారు. గతంలో జగన్, అవినాశ్‌ల కుట్రలను ఎదుర్కొన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. ఇప్పుడు సమయం చూసి సరిగ్గా పులివెందులలోనే వైసీపీని దెబ్బకొట్టేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగానే జగన్, అవినాష్‌లే టార్గెట్‌గా బాంబుల్లాంటి విమర్శలు పేల్చుతున్నారు. పులివెందులలో ఫ్యాన్ పార్టీని ఓడించడం ద్వారా అటు జగన్, అవినాష్‌లకి రిటర్న్‌గిఫ్ట్, ఇటు కూటమి అధిష్టానానికి సూపర్ గిఫ్ట్ ప్లాన్ చేశారు ఆది. ఇప్పుడు అక్కడ పరిస్థితి చూస్తుంటే.. బ్రిటిషర్ల మీద తిరుగుబాటు జరిగినట్టే పులివెందులలో వైసీపీ మీద, దశాబ్దాల పాటు సాగిన వైఎస్ కుటుంబ ఆధిపత్యం మీద, రాజారెడ్డి రాజ్యాంగం మీద తిరుగుబాటు మొదలయ్యిందా అన్నట్లుగా కనిపిస్తోంది, టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే ఆది కోరిక నెరవేరేట్టే కనబడుతోంది.