Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 22న తమిళనాడులోని మధురైలో జరిగిన మురుగన్ భక్తర్గళ్ మానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన ధర్మం పరిరక్షణపై ఆయన చేసిన శక్తివంతమైన ప్రసంగం దేశ వ్యాప్తంగా హిందూ సమాజంలో చర్చనీయాంశంగా మారింది. హిందూ మున్నణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభలో పవన్, తమిళ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తన ప్రసంగం ఆధ్యంతం తమిళంలోనే చేశారు. తమిళంలో అనర్గళంగా సాగిన పవన్ ప్రసంగం సభకు హాజరైన లక్షలాది మంది భక్తులను ఉర్రూతలూగించారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో పాటూ బీజేపీ సీనియర్ నేతలు, హిందూ స్వామీజీల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం రాజకీయ, ఆధ్యాత్మిక చర్చలకు ఆజ్యం పోసింది.
పవన్ ప్రసంగం సూడో-సెక్యులరిజం యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగట్టడంతో ప్రారంభమైంది. సెక్యులరిజం పేరుతో హిందూ దేవతలు, విశ్వాసాలపై దాడులు జరుగుతున్నాయని, ఇతర మతాల విషయంలో మాత్రం విమర్శలు లేని పక్షపాత ధోరణిని ఆయన ప్రశ్నించారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడమనీ, కానీ కొందరికి సెక్యులరిజం అంటే.. హిందూ మతాన్ని విమర్శించడం, మిగతా మతాల విషయంలో వెనకేసుకురావడమేనని ఘాటుగా వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. హిందూ సమాజం యొక్క సహనాన్ని బలహీనతగా భావించొద్దని, ధర్మం అంటే సమానత్వం, దుష్టశక్తుల నిర్మూలన అని నొక్కి చెప్పారు.
తమిళనాడులో హిందూ సభలకు ఆటంకాలు కలిగించాలని ప్రయత్నించడం “అత్యంత ప్రమాదకరం” అని హెచ్చరించారు. హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ల గురించి అవతలి వాళ్లు ఏం మాట్లాడినా జనం బాధ పడకూడదని, కోపం రాకూడదని.. ఒకవేళ తమకు బాధ, కోపం కలిగాయంటే మాత్రం… అవతలి వాళ్లు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇది ఎలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుందని ప్రశ్నించాడు. దేశంలో ఈ పరిస్థితి మారాలని.. హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే సూడో సెక్యూలరిస్టులకు బుద్ధి చెప్పాలని పవన్ పిలుపునిచ్చాడు. ఈ సభలో స్కంద షష్టి కవచ పారాయణంలో పవన్ పాల్గొనడం, 20 నిమిషాల పాటు భక్తులతో కలిసి పారాయణం చేయడం ఆయన ఆధ్యాత్మిక నిబద్ధతను తెలియజేసింది.
Also Read: Krishnam Raju Approver: జర్నలిస్టు కృష్ణంరాజు మరో సంచలన వీడియో.. త్వరలో!
Pawan Kalyan: 2026 ఎన్నికల నేపథ్యంలో… ఈ కార్యక్రమం హిందూ ఓటు బ్యాంక్ బలోపేతం కోసం జరిగిన సభగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేషనల్ మీడియాలో అందుకు భిన్నమైన చర్చ నడుస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో పవన్ ప్రసంగం ఆహ్వానించదగినదని, సూడో-సెక్యులరిజానికి పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారని అభివర్ణించింది నేషనల్ మీడియా. ఇక పవన్ కళ్యాణ్, అన్నామలైలు ఒకే వేదికపై కనిపించడం రాజకీయంగా మరింత చర్చనీయాంశం అవుతోంది. ఈ జోడీ 2026 ఎన్నికల్లో తమిళనాట ఎలాంటి ప్రభావం చూపనుంది అన్న చర్చ ఊపందుకుంది. ఓవరాల్‌గా… పవన్ ప్రసంగంలో లోతైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక సందేశం వ్యక్తమైంది. హిందూ ఐక్యత, ధర్మ పరిరక్షణ కోసం ఆయన ఇచ్చిన పిలుపు తమిళనాడు భక్తుల నుండి అపూర్వ స్పందనను రాబట్టింది. పూర్తిగా తమిళంలోనే ప్రసంగించడం, స్థానిక సంప్రదాయాలను గౌరవించడం, తమిళ ప్రజలతో భావోద్వేగ సంబంధాన్ని బలపరిచింది. ఈ సభ పవన్ నాయకత్వ శైలిని మరోసారి హైలైట్ చేసింది.