Pawan Cycle Promotion: విజయనగరం జిల్లాకు చెందిన రాజాపు సిద్ధూ గ్రామీణ ప్రాంతానికి చెందిన కళాశాల విద్యార్థి. కాలేజీకి వెళ్లడానికి రోజూ ఎదుర్కొనే ఇబ్బందులను తన మేధస్సుతో అధిగమించాలనుకున్నాడు సిద్ధూ. తక్కువ ఖర్చుతో బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ సైకిల్‌ను రూపొందించాడు. మూడు గంటల ఛార్జింగ్‌తో 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వినూత్న ఆలోచన పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చి చేరింది. అంతే… వెంటనే సిద్ధూను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని, సైకిల్‌ను స్వయంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సిద్ధూను వెనుక సీటులో కూర్చోబెట్టుకొని, ఆ సైకిల్‌ను తానే నడిపి మురిసిపోయారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఆ స్టూడెంట్ క్రియేటివిటీకి ఎక్కడ లేని గుర్తింపు తీసుకొచ్చింది.
సిద్ధూ ఆలోచనలు ఈ సైకిల్‌తోనే ఆగలేదు. “గ్రాసరీ గురు” అనే వాట్సాప్ సర్వీస్ బ్రోచర్‌ను కూడా సిద్ధూ రూపొందించాడు. ఈ సర్వీస్ గురించి తెలుసుకున్న పవన్, సిద్ధూ ప్రతిభకు మెచ్చి, లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు. సిద్ధూ చదువుకు ఆటంకం కలగకుండా, అతని వినూత్న ఆలోచనలకు మరింత పదును పెట్టేలా అవసరమైన స్టడీ, గైడెన్స్ అందించాలని అధికారులకు ఆదేశించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్… ఇప్పటివరకు పంచాయతీ రాజ్, అటవీ, పర్యావరణ శాఖలపైనే ఎక్కువగా దృష్టి సారించినప్పటికీ, సిద్ధూ లాంటి యువ మేధావి ప్రతిభను చూసి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కొత్త కార్యక్రమాలకు బీజం వేయాలనే ఆలోచనలో ఉన్నారట.
Also Read: Galla Ramachandra Rao: ఆ ఎమ్మెల్యే భర్తని టార్గెట్ చేసిన జగన్
Pawan Cycle Promotion: ఇదొక్కటే కాదు. తాజాగా మరో సంఘటనలోనూ ఏపీ డిప్యూటీ సీఎం తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. విజయనగరానికి చెందిన సూర్యకుమారి అనే మహిళ తన ఇద్దరు కుమారులు మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కుకొని మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉన్నారని ఫిర్యాదు చేసింది. ఉద్యోగాల కోసం ఏజెంట్ల చేతిలో మోసపోయిన తన కుమారులను రక్షించాలని ఆమె పవన్‌ను వేడుకుంది. ఈ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పవన్, కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించి, సూర్యకుమారి కుమారులతో పాటు మొత్తం ఎనిమిది మంది బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించి, వీరిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇక నీ కుమారులు క్షేమం అని సూర్యకుమారికి భరోసా ఇచ్చిన పవన్, త్వరలోనే వారు సురక్షితంగా తిరిగి వస్తారని ధైర్యం చెప్పారు.
సామాన్యుడితో సమానంగా కలిసిపోయే పవన్ సింప్లిసిటీకి, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే ఆయన చొరవకు, కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించే పవన్ మంచి మనసుకు అద్దం పడుతున్నాయి ఈ సంఘటనలు. సిద్ధూ లాంటి యువకుడి ఆవిష్కరణను గుర్తించి ప్రోత్సాహం అందించడం, సూర్యకుమారి వంటి సామాన్యురాలి కష్టం తీర్చడం కోసం కేంద్రంతో సమన్వయం చేయడం.. ఈ రెండు ఘటనలూ పవన్ నాయకత్వ శైలిని, ప్రజల పట్ల బాధ్యతను తెలియజేస్తున్నాయి. క్రేజీ సినిమా యాక్టర్‌గా వందల కోట్ల యాడ్ రెవెన్యూ సంపాదించే సత్తా ఉన్నప్పటికీ, అటువంటి సంపాదన తనకు అక్కర్లేదని త్యజించిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఓ ప్రతిభావంతుడైన విద్యార్థి ఆవిష్కరణకు నేడు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. అదీ పవన్ కళ్యాణ్ అంటే అంటున్నారు ఆయన అభిమానులు. రాష్ట్రంలో సిద్ధూ లాంటి ఎందరో యువ ప్రతిభావంతులు ఉన్నారు. వారి ఆలోచనలకు రెక్కలు తొడిగే కార్యక్రమాలను పవన్ రూపొందిస్తే, రాష్ట్రం సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో కొత్త ఒరవడిని సృష్టించగలదని నిపుణులు ఆశిస్తున్నారు.
