Parakamani Politics: దొంగను దోచుకున్న గజదొంగల ముఠా ప్రస్తుతం కొత్త వాదన తెరపైకి తెస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నది వాస్తవం. ఇది సీబీ సీఐడీ తేల్చిన నిజం. అలాగే పరకామణిలో దోపిడీ జరిగిందన్నది వాస్తవం. సుమారు వంద కోట్లలో శ్రీవారికి కొంతే ఇచ్చి… మిగిలింది వైసీపీ బినామీలు కొట్టేసింది నిజం. అయితే.. శ్రీవారి లడ్డూ కల్తీ చేయడం కన్నా, ఆ కుంభకోణాన్ని వెలికితీసి ప్రజల ముందు ఉంచటమే నేరమట. అలాగే పరకామణిలో దోపిడీ కన్నా, దొంగని తప్పించడం కన్నా, ఆ దొంగ దగ్గరే దోచుకోవడం కన్నా… వాటి గురించి మాట్లాడటమే అతి పెద్ద నేరమట. దీని వల్ల టీటీడీకే అప్రతిష్ట, స్వామివారికి అవమానం అంటూ వైసీపీ కొత్త పాట అందుకుంది. వారి స్కాములు బయటపెడుతోంటే… రాజకీయానికి టీటీడీని బలి చేస్తున్నారంటూ వైసీపీ నేతలు, వారి పెంపుడు విశ్లేషకులు కొందరు కొత్త రాగం తీస్తున్నారు. ప్రభుత్వాలు, విచారణ సంస్థలు, న్యాయస్థానాలు తమని ఏమీ చేయలేవని బరితెగించిన ఇలాంటి వారిని ఇక ఆ గోవిందుడే ఓ చూపు చూడాలని కోరుకుంటున్నారు శ్రీవారి భక్తులు. అసలు ఈ పరకామణి దొంగ, ఆ దొంగని దోచేసిన గజదొంగల కథేంటో ఇప్పుడు చూద్దాం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చేసిన అవినీతి గుట్టు రట్టు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. శ్రీవెంకటేశ్వరస్వామి హుండీ కానుకల లెక్కింపు విభాగమైన పరాకమణిలో జరిగిన దొంగతనం కేసు ఇప్పుడు భూమనకు చుక్కలు చూపిస్తోంది. వైసీపీ హయాంలో రవికుమార్ అనే ఉద్యోగి పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ ఫుటేజీలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అయినప్పటికీ, కేసు నమోదు చేయకుండా, లోక్ అదాలత్‌లో రాజీ చేసి, విషయాన్ని కప్పిపుచ్చారు అప్పటి టీటీడీ పాలకమండలి పెద్దలు. ఈ రాజీలో భూమన పాత్ర ఉందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read: Singareni Bonus: సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రభుత్వం
పరకామణి దొంగ రవి కుమార్ కూటబెట్టిన రూ.100 కోట్ల విలువైన ఆస్తులలో కొంత శ్రీవారికి ఇచ్చి, మిగిలింది బినామీల పేరిట గజదొంగలు రాయించుకున్నారని, ఇందులో వైసీపీ నేతలు, అప్పటి కొందరు టీటీడీ అధికారులు భాగస్వాములని వస్తోన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ దొంగతనంలో ఉద్దేశపూర్వకంగానే రవికుమార్‌ను కాపాడేందుకు లోక్ అదాలత్‌లో రాజీ చేయించి, కేవలం స్వల్ప ఆస్తులను మాత్రమే టీటీడీ పేరిట రాయించారని కూటమి అంటోంది. హైకోర్టు ఈ రాజీని రద్దు చేసి, సీఐడీ విచారణకు ఆదేశించడంతో భూమన ఇరుకున పడ్డారు. ఒక మాజీ టీటీడీ ఉన్నతాధికారి అప్రూవర్‌గా మారి, ఈ దోపిడీలో భూమన సహా వైసీపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.
భూమన మాత్రం… “మేం టీటీడీకి రూ.100 కోట్ల ఆస్తులు రాయించాం, సీబీఐ విచారణకు సిద్ధం” అంటూ ఇంకా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. కానీ, దేవుడి సొమ్మును దోచుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారని కూటమి నేతలు అంటున్నారు. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి, మంత్రి లోకేశ్‌లు ఈ వ్యవహారంపై బహిరంగంగా ఆరోపణలు చేస్తూ, భూమనను టార్గెట్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కేసులో రవికుమార్‌తో పాటు అధికారులకు నోటీసులు జారీ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
పరాకమణి దొంగతనం కేసు తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యతను ప్రశ్నిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ అవినీతి, దేవుడి సొమ్మును దుర్వినియోగం చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. భూమన ఈ ఆరోపణల నుంచి తప్పించుకుంటారా లేక కూటమి బ్రహ్మాస్త్రం వారిని కట్టడి చేస్తుందా? విచారణ ఫలితాలే సమాధానం చెప్పనున్నాయి.