NDL Medical Collage

NDL Medical Collage: మెడికల్‌ కాలేజీ రచ్చ… శిల్పా VS భూమా

NDL Medical Collage: రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తమ హయాంలో రాష్ట్రంలో 17 కాలేజీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు, నిధులు తీసుకొచ్చి నిర్మాణాన్ని చేపట్టామంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే, కొన్ని కాలేజీల నిర్మాణం పూర్తయి, వాటిలో కొన్ని ప్రారంభమైనప్పటికీ, మరికొన్ని కాలేజీల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఎక్కువ కాలేజీలు ఇంకా పునాది దశలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ విధానంలో నిర్మాణాలను పూర్తి చేసి, ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు మెడికల్ కాలేజీలకు అనుమతి లభించగా, నంద్యాల మెడికల్ కాలేజీ నిర్మాణం అరకొరగా పూర్తయి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అయితే, ఆదోని మండలం ఆరెకల్లు సమీపంలో ఉన్న మరో కాలేజీ నిర్మాణ దశలోనే ఆగిపోయింది.

ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీలను సందర్శించి, కూటమి ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మెడికల్ కాలేజీలను సందర్శించి, పీపీపీ విధానంతో బడుగు, బలహీన, పేద విద్యార్థులు వైద్య సీట్లను కోల్పోతారని ఆరోపించారు. ప్రైవేటీకరణ జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అలాగే, కర్నూలు జిల్లా వైసీపీ నాయకులు ఆరెకల్లు సమీపంలో నిర్మాణం ఆగిపోయిన మెడికల్ కాలేజీని సందర్శించి, కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు.

Also Read: Rahul Gandhi: లక్షలాది ఓట్లు తొలగించారంటూ రాహుల్ గాంధీ ఈసీపై మరో బాంబ్

అయితే వైసీపీ నాయకుల మెడికల్ కాలేజీల సందర్శనపై టీడీపీ నాయకులు ఘాటుగా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం చాలా చోట్ల దుర్వినియోగం చేసి, నిర్మాణాలను పూర్తి చేయలేదని మండిపడ్డారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పీపీపీ విధానం గురించి తెలియకుండా మాట్లాడుతున్నారని నంద్యాల జిల్లా టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలను పూర్తి చేస్తే.. కాలేజీలు త్వరగా అందుబాటులోకి వస్తాయని.. అవి ప్రభుత్వ ఆధీనంలోనే పని చేస్తాయని వివరించారు. ఈ విషయం తెలియకుండా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మెడికల్ కాలేజీలను సందర్శించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

మొత్తంగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మొదలైందని చెప్పవచ్చు. పీపీపీ విధానంలో నిర్మాణాలను పూర్తి చేసి, పేద ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు, వైసీపీ నాయకులు మాత్రం వైద్య సేవలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం సరికాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా… పీపీపీ విధానంపై ప్రజలకు స్పష్టంగా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *