Nani vs Chinni Fight: రాష్ట్రానికి నడిబొడ్డైన బెజవాడ రాజకీయాల్లో కేశినేని బ్రదర్స్ అంటే తెలియని వారుండరు. అనుకువ, విశ్వసనీయత, ప్రజాసేవ వంటి గుడ్ క్వాలిటీస్‌తో తమ్ముడు కేశినేని చిన్ని రాజకీయంగా ఉన్నత స్థానంలో వెళ్లి కూర్చుంటే… మితిమీరిన ఆత్మాభిమానం, అహంకారం, గర్వం వంటి బ్యాడ్ క్వాలిటీస్‌తో అన్న కేశినేని నాని రాజకీయంగా అట్టడుగు స్థానంలో పడిపోయారని బెజవాడ రాజకీయాలపై అవగాహన ఉన్నవారు చెప్తుంటారు. రెండు సార్లు ఎంపీగా గెలిచానన్న గర్వం, ఏ పార్టీతో సంబంధం లేకుండానే గెలుస్తాననే ఓవర్ కాన్ఫిడెన్స్, రెండు సార్లు టీడీపీ ఎంపీ టికెట్ ఇస్తే, ఆ విశ్వాసం లేకుండా తనకు ఏ హైకమాండ్ లేదన్నట్లుగా వ్యవహరించడం, పార్టీ కోసం నిలబడాల్సిన సమయంలో పార్టీ ప్రత్యర్థులతో చట్టాపట్టాలేసుకుని తిరగడం, చివరికి తనని తలదన్నే వాడు తన సొంత ఇంటి నుండే పుట్టుకొస్తాడని గ్రహించకపోవడం.. గ్రహించినా తలకెక్కించుకోలేనంత చులకన భావం.. తీరా సొంత తమ్ముడి చేతిలోనే ఓడిపోయానన్న అవమాన భారం.. వెరసి తన రాజకీయ పతనావస్థకు తమ్ముడు కేశినేని చిన్నినే కారణమన్న ఆవేదన.. మాజీ ఎంపీ కేశినేని నానిని ఒక్క పట్టాన కుదుటగా ఉండనివ్వడం లేదు.
అందుకే తలా తోక లేని విమర్శలతో తమ్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లున్నారు కేశినేని నాని. మోకాలుకు, బోడిగుండుకు ముడిపెడుతూ.. తన తమ్ముడికి సన్నిహితులు, స్నేహితులు ఎవ్వరూ కూడా ఏపీలో వ్యాపారాలు చేయకూడదు అన్నట్లు బురద జల్లుతున్నారు కేశినేని నాని. ఇటీవల URSA (అర్సా) క్లస్టర్స్‌లో డైరెక్టర్ హోదాలో ఉన్న ఓ వ్యక్తి, కేశినేని చిన్నికి గతంలో క్లాస్ మేట్ కాబట్టి… అర్సా క్లస్టర్స్‌కు భూములు ఇవ్వడం పెద్ద స్కామ్ అంటూ వాదించారు కేశినేని నాని. 99 పైసలే భూములు ఇచ్చేస్తున్నారంటూ వైసీపీ స్క్రిప్ట్ పట్టుకుని పసలేని ఆరోపణలు చేశాడు. తాజాగా ‘ఫ్రైడ్ ఇన్‌ఫ్రా కాన్ ఎల్‌ఎల్‌పీ’ అనే సంస్థలో రాజ్ కెసిరెడ్డితో కలిసి కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మీ డైరెక్టర్లుగా ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. ఏకంగా మద్యం స్కామ్‌కి, కేశినేని చిన్నికి ముడిపెట్టి మరో రచ్చ మొదలుపెట్టారు.
టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై, ఆయన సోదరుడు కమ్ ప్రత్యర్థి అయిన మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదుల పర్వం కొనసాగుతోంది. మొన్న విశాఖలో అర్సా క్లస్టర్స్‌కు భూముల కేటాయింపు వెనుక.. కేశినేని శివనాథ్ ఉన్నారని అడ్డగోలు ఆరోపణలు చేశారు. అందుకు పరువునష్టం నోటీసు పంపి కేశినేని చిన్ని ధీటుగా బదులిచ్చారు. అదే సమయంలో అర్సా క్లస్టర్స్ కంపెనీ ప్రతినిధులు స్పందించడం, ప్రభుత్వ వర్గాల నుండి కూడా స్పష్టత రావడంతో.. అర్సా క్లస్టర్స్ భూ కేటాయింపుల విషయంలో వైసీపీతో సహా కేశినేని నాని చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఇప్పుడు తాజాగా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన రాజ్ కసిరెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాలతో చిన్నికి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు కేశినేని నాని.
Also Read: Sujana Chowdary: లండన్‌లో బీజేపీ ఎమ్మెల్యేకు తీవ్రగాయాలు
Nani vs Chinni Fight: మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మితో కలిసి ‘ప్రైడ్ ఇన్ఫ్రా కాన్ ఎల్.ఎల్.పి’ అనే సంస్థలో భాగస్వాములుగా ఉన్నారనీ, హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్లాట్ నెంబర్ 9, సర్వే నంబర్ 403 చిరునామాతో ఈ సంస్థ రిజిస్ట్రీ అయ్యిందని కొన్ని వివరాలు కూడా బయటపెట్టారు. అలాగే రాజ్ కసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న ‘ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే మరో సంస్థ కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోందని, ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక మెయిల్ ఐడిని వినియోగిస్తున్నాయనీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న నిధులను వినియోగించి కేశినేని చిన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నది కేశినేని నాని చేస్తున్న ఆరోపణ.
అయితే దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. వాస్తవానికి కేశినేని నాని నీతిమాలిన ఆరోపణలకు స్పందించేయాల్సిన అవసరం లేదని, అయితే ప్రజా ప్రతినిధిగా ప్రజలకు, పార్టీ క్యాడర్‌కు స్పష్టత ఇవ్వడం కోసమే స్పందిస్తున్నానని తెలిపారు. వెన్నుపోటు దారుడు, నయవంచకుడు, నమ్మక ద్రోహీ, జగన్ రెడ్డికి గూఢచారిగా పని చేసిన వ్యక్తి కేశినేని నాని అని మండిపడ్డారు. ఇప్పుడు పనిగట్టుకుని చేసే పనికిమాలిన, పసలేని ఆరోపణలపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముందు తమ సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంస్థకు చెందిన స్థలం ఉన్నందున సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో ఆ సంస్థను రిజిస్టర్ చేసినట్లు చిన్ని వివరించారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్‌లో అందరికి అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కసిరెడ్డి సంస్థతో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా అప్పుడే నిర్ణయం తీసుకున్నానని చిన్ని వివరించారు. తద్వారా ఆర్థికంగా నష్టపోయానన్నారు. ఇక అమెరికా, దుబాయ్ కంపెనీలు అంటూ నాని సృష్టించిన ఫేక్ కంపెనీలను నిరూపించాల్సిన బాధ్యత.. తనపై ఆరోపణలు చేసిన వారిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. నానికి సత్తావుంటే తనకు, కెసిరెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీలను నిరూపించాలని సవాల్ చేశారు.
Also Read: Shivalik Sharma: MI మాజీ ప్లేయర్ శివలిక్ శర్మపై అత్యాచార కేసు..అరెస్ట్ చేసిన పోలీస్
Nani vs Chinni Fight: కేశినేని నాని ఆరోపణలు చేసినట్లే రాజ్ కెసిరెడ్డి, కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మీ ఓ కంపెనీకి డైరెక్టర్లుగా ఉన్నమాట వాస్తవమే. దానికి కారణమేంటన్నది ఎంపీ కేశినేని చిన్ని క్లారిటీ ఇచ్చారు. కానీ రాజ్ కెసిరెడ్డితో ఎంపీ కేశినేని చిన్ని అక్రమ వ్యాపార లావాదేవీలు చేసినట్లు కానీ, మద్యం కుంభకోణంతో లింకులు ఉన్నట్లు కానీ ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు. అందుకే కేశినేని చిన్ని అంత ధైర్యంగా సవాల్ చేసినట్లు అర్థమౌతోంది. నిజానికి నాని దగ్గర ఏ చిన్న ఆధారం ఉన్నా తన తమ్ముడు చిన్నిపై ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టరు. నేరుగా వెళ్లి.. తన వద్ద ఉన్న ఆధారాలతో చిన్నిపై సీఐడీకి ఫిర్యాదు చేసేవారు. అంతేకానీ ఇలా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతూ కూర్చునే వారు కాదన్నది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమౌతుంది.
ఇక కేశినేని బ్రదర్స్ ఇద్దరి మనస్థత్వాలు బాగా ఎరిగిన బెజవాడ వాసులు.. కేశినేని నానిని పట్టించుకోవడం ఏనాడో మానేశారన్న టాక్ ఉంది. అయినా సరే.. ఇలా టార్గెటెడ్‌గా చేస్తున్న ఆరోపణలతో, రాజకీయ రచ్చతో నాని ఏం సాధించదలుచుకున్నారో ఎవరికీ అంతుబట్టడం లేదు. కేశినేని బ్రదర్స్ మధ్య విభేదాలు ఈనాటివి కాదు. కేశినేని నాని ఎంపీగా ఉన్నప్పుడు, చిన్ని తన అన్నతో రాజకీయంగా విభేదించినా సరే.. సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్లారే తప్ప.. ఏనాడూ ఇలా అన్నపై కక్షగట్టి ఆరోపణలు చేసిన సందర్భాలు లేవు. రాష్ట్రానికి విషపూరితం లాంటి పార్టీ నీడలో ఉంటూ, తన చుట్టూ కాల నాగుల్ని పెట్టుకుని రాజకీయం చేస్తున్న కేశినేని నాని.. ప్రజల్లో ఏనాడో విశ్వసనీయత కోల్పోయారనీ, ఇలాంటి నేపథ్యంలో కక్ష పూరిత ఆరోపణలు, ఫిర్యాదుల పర్వంతో నాని సాధించేది ఏదీ ఉండదన్న గట్టి అభిప్రాయం అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.
