Maoist Compromise: మావోయిస్టులు ఒక్కసారిగా తమ స్వరం మార్చారు. నిత్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే వీరు తాజాగా శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కేంద్రంతో చర్చలకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని కోరారు. తాము కూడా కాల్పుల విరమణ పాటించి, శాంతి చర్చలకు సానుకూల వాతావరణం కల్పిస్తామని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే, అందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
కొంతకాలంగా కేంద్ర బలగాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఐదు రాష్ట్రాల అడవుల్లో విరుచుకుపడుతూ, పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిపాయి. వందల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని శపథం చేసిన కేంద్రం, ‘ఆపరేషన్ కగార్’ను ఉధృతంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దండకారణ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఏడాది మూడు నెలల్లోనే వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 130 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఒక్క బస్తర్ ప్రాంతంలోనే 116 మంది చనిపోయారు. గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో 30 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు.
2024 ఏప్రిల్ 16న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన సుధాకర్ అలియాస్ మురళి అలియాస్ శంకర్‌రావు మరణించాడు. ఆయన భార్య, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రజిత కూడా ప్రాణాలు కోల్పోయింది. ఏప్రిల్ 30న ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన కేశవేణి రవి అలియాస్ వినయ్ చనిపోయాడు. జూలై 25న ములుగు-భద్రాద్రి జిల్లాల సరిహద్దు దామెరతోగు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భూపాలపల్లి జిల్లా గణపురం మండలానికి చెందిన అశోక్ అలియాస్ విజేందర్ కన్నుమూశాడు.
Also Read: HCU Issue: కంచ గచ్చిబౌలి భూములపై విచారణకు సిద్ధమైన క్యాబినెట్ కమిటీ
Maoist Compromise: సెప్టెంబర్ 5న కాజీపేట మండలం టేకులగూడెంకు చెందిన కీలక నేత మాచర్ల యేసోబు అలియాస్ ఎల్లన్న అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దంతెవాడ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అదే జిల్లాలో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామానికి చెందిన అంకేశ్వరం సారయ్య అలియాస్ సుధీర్ అలియాస్ సుధాకర్ అలియాస్ మురళీ హతమయ్యాడు. దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడైన సారయ్యపై 25 లక్షల రివార్డు ఉంది.
మావోయిస్టు పార్టీలో మిగిలిన వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంపై పోలీసులు దృష్టి పెట్టారు. లొంగుబాట్లను ప్రోత్సహిస్తూ, దండకారణ్యంలో వయోభారం, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారిని జనారణ్యంలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు. లొంగిపోతే కేసులను ఎత్తివేయడంతోపాటు రివార్డు అందిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని చెబుతున్నారు. ఇటీవల పోలీసులు మావోయిస్టు కుటుంబాలను కలిసి, వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులకు నిత్యావసరాలు, మందులు అందించారు. దశాబ్దాలుగా నమ్మిన సిద్ధాంతాన్ని వీడి అన్నలువిప్లవోద్యమం నుంచి జనజీవనంలోకి వస్తారా? పోలీసుల ప్రయత్నం ఫలిస్తుందా? వేచి చూడాలి.