Macherla Murders: ఎన్నికల టైంలో మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మాక ఘటనలతో రాష్ట్రం మొత్తం ఆ నియోజకవర్గం వైపు చూసింది. గడిచిన ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో నియోజకవర్గంలో ప్రతిపక్ష క్యాడర్‌పై పదుల సంఖ్యలో హత్యలు, వందల సంఖ్యలో దాడులు జరగాయి. అయితే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలిచిన తరువాత.. ఆయన శాంతి మంత్రంతో ఈ సంవత్సర కాలంలో ఎలాంటి హింసాత్మాక ఘటనలు జరగలేదు. దీంతో నియోజకవర్గ ప్రజలు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మొన్న నియోజకవర్గం వెల్దుర్తి మండల పరిధిలోని బోధిల వీడు గ్రామ సమీపంలో జరిగిన జంట హత్యలతో సంవత్సర కాలంగా ప్రశాంతంగా ఉన్న మాచర్ల ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
వెల్దుర్తి మండలం బోధిల వీడు గ్రామ సమీపంలో గుండ్లపాడు గ్రామానికి చెందిన జివిశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు కొటేశ్వరరావును అంత్యంత దారుణంగా హత్య చేశారు దుండగులు.అయితే హత్యలో పాల్గొన్న జల్లిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, తోట గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వరరావులు సైతం గుండ్లపాడు గ్రామానికి సంబంధించిన వారే కావడంతో అందరూ టీడీపీ అంతర్గత గొడవలే కారణం అనుకున్నారు. జిల్లా ఎస్పీ సైతం ఇదే స్టేట్మెంట్‌ని మీడియాకి వెల్లడించారు. సీన్ కట్ చేస్తే.. భారీ పథకం ప్రకారం జరిగిన హత్యలని పోలీసుల విచారణలో తేలింది.
సుమారు నాలుగు వేలకి పైగా ఓటర్లు ఉన్న గుండ్లపాడు విలేజ్‌లో.. 2022 వరకూ తోట చంద్రయ్య, జివిశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు కోటేశ్వరరావులు కీలక నేతలుగా ఉండేవారు. తోట చంద్రయ్య గత వైసీపీ హయాంలోనే అత్యంత కిరాతకంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. తోట చంద్రయ్య మరణం తరువాత గుండ్లపాడు గ్రామంలో టీడీపీకి పెద్ద దిక్కుగా మారారు చిన్న వెంకటేశ్వర్లు, అతని తమ్ముడు కోటేశ్వరరావు. సంవత్సరం క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం గ్రామంలో టీడీపీకి భారీ మోజార్టీ రావడానికి ఈ అన్నదమ్ములే కారణం. ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మనందరెడ్డి సైతం గ్రామంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఈ ఇద్ధరు అన్నదమ్ములకే ప్రియారిటీ ఇచ్చేవారు.
Also Read: AP Ration Distribution: నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ..
Macherla Murders: ఇది ఓర్చుకోలేని A1-జల్లిశెట్టి శ్రీను, A2-తోట వెంకట్రామయ్య, A3-తోట గురవయ్య, A4-దొంగరి నాగరాజు, A5-తోట వెంకటేశ్వర్లు, A6, A7 నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరుల సపోర్ట్‌తో హత్య చేసినట్లు తెలుస్తోంది. A5 వరకూ ఉన్న మొదటి ఐదుగురు నిందితులలో తోట గురవయ్య వైసీపీ కీలక నేతగా ఉన్నారు. మిగిలిన వారు ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి నిత్యం వైసీపీ కోవర్టులుగా పనిచేశారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఒక నెల రోజుల క్రితం.. తోట గురవయ్యతో సహా A5 వరకూ ఉన్న నిందితులంతా పిన్నెల్లి సోదరులకు టచ్‌లో ఉన్నారని తెలిసి.. టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మందలించినట్లు సమాచారం. దీంతో గ్రామంలో ఈ అన్నదమ్ముల అడ్డు తొలగించుకోకపోతే కష్టం అని భావించిన నిందితులు.. చిన్న వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు సోదరులను అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
ప్రస్తుతం ఈ జంట హత్యలలో పాల్గొన్న A1-జల్లిశెట్టి శ్రీను, A2-తోట వెంకట్రామయ్య, A3-తోట గురవయ్య, A4-దొంగరి నాగరాజు, A5-తోట వెంకటేశ్వర్లుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరికి వెనుక నుండి సపోర్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న A6-పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, A7-పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు మాత్రం పరారీలో ఉన్నారు. చూడాలి మరి మాచర్లలో శాంతి భద్రతల విషయంలో నిందతులపై పోలీసులు, న్యాయస్థానాలు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నాయో.