Lokesh vs Jagan War: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేష్‌ల మధ్య మాటల యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్, అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో చెలరేగారు. అధికారులు, ప్రతిపక్ష నేతలపై నోరు పారేసుకున్నారు. కానీ, 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వైసీపీ 11 సీట్లకు పరిమితమై, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. అయినా, జగన్ తీరు మారలేదు. అసెంబ్లీకి రాకుండా, అప్పుడప్పుడు పరామర్శల పేరిట బయటకొస్తూ.. అధికారులపై, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ ఎస్‌ఐ స్థాయి అధికారి కూడా జగన్‌కు వార్నింగ్ ఇచ్చే స్థాయికి దిగజారారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.
రాజకీయ నాయకుడికి సంస్కారం ముఖ్యం. అది లేనప్పుడు రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు చెబుతారు. వైసీపీ ఓటమికి జగన్‌తో పాటు ఆ పార్టీ నేతల నోటి దూల కూడా కారణమైంది. కొడాలి నాని, రోజా, జోగి రమేష్, పేర్ని నాని, అంబటి, గుడివాడ వంటి నేతలు వ్యక్తిగత విమర్శలు, అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. జగన్ కూడా అదే బాటలో నడిచారు. సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు… విమర్శల కంటే దిగజారుడు వ్యాఖ్యలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఆ పార్టీ ప్రజల్లో మరింత చులకనైంది. అయితే అధికారం పోయాక వైసీపీ నేతలు తమ నోళ్లను అదుపులో ఉంచుకున్నారు. కానీ జగన్ వైఖరిలోనే మార్పు కనిపించడం లేదు. తాజాగా, జగన్ సోషల్ మీడియాలో ఏపీ విద్యా వ్యవస్థపై విమర్శలు చేశారు. ఏపీ ఈసెట్ అడ్మిషన్లలో లోపాలున్నాయని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
Also Read: Celebrity Cricket Mela: టెక్సాస్‌లో సెలెబ్రిటీ క్రికెట్ మేళా గ్రాండ్ సక్సెస్
Lokesh vs Jagan War: ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి, “అమాత్య మేలుకో.. పప్పు నిద్ర వదులు” అంటూ వెటకరానికి పోయారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. లోకేష్ ఘాటుగా స్పందిస్తూ, “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారూ” అని మర్యాదపూర్వకంగా బదులిచ్చారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన వారు నీతులు చెప్పడం విడ్డూరమని, తాము ఏడాదిలోనే సంస్కరణలు తెచ్చి విద్యా వ్యవస్థను గాడిన పెట్టామని లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో ఈసెట్ కౌన్సిలింగ్‌లో జాప్యం జరిగిందని, తాము జూలై మూడో వారంలోనే మొదటి కౌన్సిలింగ్‌ని పూర్తి చేశామని చురకలు అంటించారు.
గత పదేళ్లుగా వైసీపీ లోకేష్‌ను ‘పప్పు’ అంటూ అవహేళన చేసింది. కానీ, లోకేష్ తన పనితీరుతో ‘నిప్పు’గా నిరూపించుకున్నారు. ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు తగ్గించడంలో కీలక పాత్ర వహించి, లోకేష్ తన సత్తా చాటారు. అయినా, జగన్ తీరు మారలేదు. “పప్పు, గిప్పు” అంటూ నోరు పారేసుకున్న జగన్‌కు టీడీపీ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. “పులివెందులలోనూ తరిమేస్తారు, జాగ్రత్త” అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో సంస్కారం, సమస్యల పరిష్కారంపై దృష్టి లేకపోతే వైసీపీ తిరిగి పుంజుకోవడం అసాధ్యం అని పరిశీలకులు సూచిస్తున్నారు.