Liqueur case big update: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణం రెండు నెలలుగా రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో కీలక అరెస్టులు జరిగినప్పటికీ, పెద్ద తలకాయలపై ఉచ్చు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోసం ఎదురుచూస్తోందని సమాచారం. వైఎస్ జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల అరెస్టు తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ అరెస్టులతో ప్రముఖులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు షికారు చేశాయి. అయితే, రాజకీయ, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆధారాల సేకరణ పూర్తి చేసి, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కీలక అడుగులు పడనున్నాయి. ఈ క్రమంలోనే జూన్ 10న జరగాల్సిన ఒక ముఖ్యమైన అరెస్టు వాయిదా పడినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
లిక్కర్ కుంభకోణంలో వైసీపీకి చెందిన పలువురు పాత్రధారులున్నారని, అందులో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా ఒకరని ఏపీ సీఐడీ ఆరోపిస్తోంది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణలో సీఐడీ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూద్రా కీలక వాదనలు వినిపించారు. ఈ కుంభకోణంలో కమీషన్లు చెల్లించిన మద్యం కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు లభించాయని, ఈ వ్యవహారాన్ని మిథున్ రెడ్డి స్వయంగా నిర్వహించారని ఆయన తెలిపారు. డికార్ట్ లాజిస్టిక్స్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలో రూ.5 కోట్లు జమా అయినట్లు బ్యాంకు లావాదేవీల పత్రాలతో సహా హైకోర్టుకు సమర్పించారు. అయితే కేసు నమోదైన తర్వాత తప్పించుకునేందుకే ఆ డబ్బును డీకార్ట్ లాజిస్టిక్స్‌కు తిరిగి పంపినట్లు లూద్రా స్పష్టం చేశారు. మిథున్ విచారణకు సహకరించడం లేదని, బెయిల్ మంజూరు చేయవద్దని ఆయన కోర్టును కోరారు.
Also Read: Nara Lokesh: ఢిల్లీ వెళ్లిన మంత్రి నారా లోకేష్..ఎందుకంటే..?
Liqueur case big update: మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది… ఆయనకు లిక్కర్ పాలసీతో సంబంధం లేదని, అందుకు ఎలాంటి ఆధారాలు లేవని వాదించారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్‌లో మిథున్‌కు ప్రమేయం లేదని, డీకార్ట్ లాజిస్టిక్స్‌కు రూ.5 కోట్లు తిరిగి చెల్లించారు కాబట్టి దానిని లిక్కర్ డబ్బుగా పరిగణించకూడదని చెప్పుకొచ్చారు. అయితే, సీఐడీ న్యాయవాది లూద్రా వాదిస్తూ… పీఎల్ఆర్ ప్రాజెక్స్ట్ మిథున్ కుటుంబ సభ్యులదేనని, ఆ సంస్థకు సంబంధించి రూ.47.74 కోట్ల బకాయిలు ఉన్నట్లు స్వయంగా మిథున్ రెడ్డే తన ఎన్నికల అఫిడవిట్‌లో చూపారని సాక్షాధారాలతో సహా కోర్టుకు రుజువు చేశారు. సాక్షులు, నిందితుల స్టేట్‌మెంట్లు మిథున్ పాత్రను స్పష్టం చేస్తున్నాయని లూద్రా వాదించారు. మూడు గంటల వాదోపవాదాల అనంతరం హైకోర్టు విచారణను వాయిదా వేసింది. తదుపరి హియరింగ్‌లో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

