Leaders Flight Problems: ఆంధ్రప్రదేశ్‌లో విమాన సర్వీసుల గందరగోళం రాజకీయ చర్చకు దారితీసింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తాజాగా చేసిన ట్వీట్, విశాఖపట్నం-విజయవాడ విమాన కనెక్టివిటీ సమస్యలను బహిర్గతం చేసి, రాష్ట్ర ఎయిర్‌పోర్టు మౌలిక సదుపాయాలపై విస్తృత చర్చకు కారణమైంది. ఈ సమస్యల వెనుక 2019-2024 మధ్య వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని గంటా పరోక్షంగా సూచించినప్పటికీ, సొంత పార్టీ అధినాయకత్వం నుండే ఆయనకు షాక్ తగిలింది. గంటా తన ట్వీట్‌లో, “ఆంధ్రా టు ఆంధ్రాకు వయా తెలంగాణ” అని ప్రస్తావించడమే అందుకు కారణమైంది.
విశాఖ నుంచి విజయవాడ చేరేందుకు ఉదయం 8 గంటలకు బయలుదేరిన గంటా, హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం చేరారు. విశాఖ-విజయవాడ మధ్య ఉదయం నడిచే రెండు విమానాల రద్దు, వందేభారత్ రైలు అందుబాటులో లేకపోవడం ఈ గందరగోళానికి కారణమని ఆయన పేర్కొన్నారు. సీఐఐ, ఫిక్కీ వంటి పారిశ్రామికవేత్తలు కూడా ఇదే సమస్య ఎదుర్కొన్నారని, ఇది విశాఖ ప్రయాణీకుల దుర్దశను తెలియజేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అయితే అనుకోకుండా ఈ ట్వీట్ వైసీపీకి ఆయుధంగా మారటంతో, టీడీపీ హైకమాండ్ అసహనం వ్యక్తం చేసింది. సమస్యలను సోషల్ మీడియాలో కాక, పార్టీ ఫోరమ్‌లో లేదా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో చర్చించాలని గంటాకు సూచించింది.
Leaders Flight Problems: గంటా ట్వీట్‌పై టీడీపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించినప్పటికీ, ఈ సమస్య వైసీపీ హయాంలోని మౌలిక సదుపాయాల వైఫల్యాలను ఎత్తి చూపిందని పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీ నాయకులు గంటా ట్వీట్‌ను కూటమి ప్రభుత్వంపై విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, గంటా ఉద్దేశం వైసీపీ గత వైఫల్యాలను బయటపెట్టడమేనని ఆయన సన్నిహితులు స్పష్టం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీ సమస్యలను తీవ్ర చర్చకు తెచ్చింది. విశాఖ, అమరావతి, రాయలసీమ.. ప్రాంతాల మధ్య ఎయిర్ కనెక్టివిటీ కీలకమని, ఇది పెరిగితేనే పారిశ్రామికవేత్తల రాకపోకలు, పెట్టుబడులు సులభమవుతాయన్నది గంటా ట్వీట్‌లోని సారాంశంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.
2019-2024 మధ్య వైసీపీ పాలనలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి “మాటలు కోటలు దాటాయి, చేతలు గడప దాటలేదు” అన్న సామెతకు నిదర్శనంగా నిలిచింది. భీమవరం, ఒంగోలు, దగదర్తిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రకటనలు హడావిడిగా జరిగినప్పటికీ, అమలు దారుణంగా విఫలమైంది. రాష్ట్ర రుణం రూ.13.5 లక్షల కోట్లకు చేరడంతో, నిధుల కొరత ఎయిర్‌పోర్టు ప్రాజెక్టులను స్తబ్దుగా మార్చింది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం 2024 నాటికి కూడా పురోగతి సాధించలేదు.
Also Read: Goshala Issue: మాజీ టీటీడీ ఛైర్మన్ హౌస్ అరెస్ట్
Leaders Flight Problems: విశాఖపట్నం, విజయవాడ ఎయిర్‌పోర్టులలో అంతర్జాతీయ సర్వీసుల విస్తరణ నిలిచిపోయింది. మూడు రాజధానుల విధానం గందరగోళం సృష్టించి, అమరావతి ఎయిర్‌పోర్టు అభివృద్ధి పూర్తిగా మరుగున పడింది. రాజమండ్రి, కడప ఎయిర్‌పోర్టులలో కనీస మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు. విమాన సర్వీసుల సంఖ్య పెరగకపోవడంతో ఆర్థిక వృద్ధి, టూరిజం రంగాలు దెబ్బతిన్నాయి. “జిల్లాకో ఎయిర్‌పోర్టు” అన్న జగన్ ప్రకటనలు కేవలం ట్రోలర్ల ట్రోలింగ్స్‌కి మాత్రమే పనికొచ్చాయి. ఈ వైఫల్యాలు 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమికి కీలక కారణంగా నిలిచాయి.
గంటా శ్రీనివాసరావు ట్వీట్… రాష్ట్రంలో విమాన కనెక్టివిటీ సమస్యలను బహిర్గతం చేసి, వైసీపీ హయాంలో ఎయిర్‌పోర్టుల అభివృద్ధి వైఫల్యాలను మరోసారి చర్చకు తెచ్చింది. ఈ సమస్యలు ఆర్థిక, పరిపాలన రాజధానుల మధ్య కనెక్టివిటీని దెబ్బతీస్తూ, పెట్టుబడుల ఆకర్షణకు అడ్డంకిగా నిలిచాయి. ఈ సమస్యలను పరిష్కరించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన సవాల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందుంది.

