Kodali Nani America Plan: గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్యం గురించి రాష్ట్రంలో రాజకీయ సంచలనం రేగుతోంది. ఇటీవల స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నాని విషయంలో మొదట్లో గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పినప్పటికీ, యాంజియో పరీక్షల్లో గుండె రక్తనాళాల్లో మూడు బ్లాక్‌లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆయన్ను సోమవారం ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. సాయి కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిన ఈ విమానంలో కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్, నర్సు కూడా ఉన్నట్లు సమాచారం. ముంబైలో బైపాస్ సర్జరీ చేయించుకుంటారని అంటున్నారు, కానీ ఆయన ఆరోగ్యం గురించి ఏఐజీ ఆస్పత్రి లేదా కుటుంబం నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ రాలేదు. ఇది రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిచ్చింది.
కొడాలి వర్గీయుల నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం, గుండెలోని నాలుగు వాల్వుల్లో మూడు మూసుకుపోవడంతో పాటు కిడ్నీ సమస్యలు కూడా బయటపడ్డాయట. ఇలాంటి పరిస్థితిలో సర్జరీ సంక్లిష్టమని, అందుకే ముంబైకి తరలించారని చెబుతున్నారు. అయితే, హైదరాబాద్ కంటే మెరుగైన వైద్యం కోసం అంటూ ముంబైకి, అక్కడి నుంచి అమెరికాకి వెళ్లే ప్లాన్ ఉందనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇది నిజమైతే, కొడాలి రాజకీయ ఒత్తిళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆరోగ్యాన్ని కారణం చూపుతున్నారా? అనే చర్చ మొదలైంది.
Also Read: Hyderabad: గుడ్ న్యూస్.. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు
Kodali Nani America Plan: గతంలో చంద్రబాబు, లోకేష్‌లపై అసభ్యకర వ్యాఖ్యలతో వివాదాస్పదంగా మారిన కొడాలి, ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీ పోలీసుల కేసులతో ఇరుక్కున్నారు. టీడీపీ రెడ్ బుక్‌లో తన పేరు ఉందని, అరెస్టు, జైలు తప్పదని భయపడి.. ఈ ఆరోగ్య డ్రామా ఆడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. “రెడ్ బుక్ చూసి గుండెపోటు వచ్చింది” అంటూ నారా లోకేష్ సెటైర్లు వేయడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చింది. గత ఐదేళ్లలో బూతు రాజకీయాలతో ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన కొడాలికి ఇప్పుడు సానుభూతి లభిస్తుందా? అంటే… “చేసుకున్నవాడికి చేసుకున్నంత” అనే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఆయన ఆరోగ్యం గురించి కార్యకర్తల్లో ఆందోళన, ప్రజల్లో సానుభూతి లేకపోయినప్పటికీ.. కొడాలి నాని త్వరగా కోలుకొని, గుడివాడ తిరిగొచ్చి, పూర్తి ఆరోగ్యంతో కేసులను ఎదుర్కోవాలని సాక్షాత్తూ తెలుగు తమ్ముళ్లు ఆశిస్తుండం కొసమెరుపు అనే చెప్పాలి. ఏది ఏమైనా కొడాలి నాని రాజకీయ భవిష్యత్తు, అమెరికా ప్లాన్ గురించి ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు.