Kadapa District President: కడప పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి కోసం టీడీపీ వేట మొదలయ్యింది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజకవర్గాల్లో ఏడు చోట్ల గెలిచిన కూటమి.. ఇక నుండి 2029 టార్గెట్‌గా పనిచేసి, రానున్న ఎన్నికల్లో పులివెందుల కంచుకోట బద్ధలు కొట్టాలని భావిస్తోంది. అయితే వైనాట్ పులివెందుల నినాదాన్ని నిజం చేయగల సామర్థ్యం ఉన్న టీడీపీ రథసారధి ఎవరా అన్న ఆలోచన కడప జిల్లాలో మొదలైంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు పటిష్టతమైన నాయకత్వం అందించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. సీనియర్లు, యువత నేతల కాంబినేషన్‌లో పార్టీకి బలమైన నాయకత్వాన్ని అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈసారి మొహమాటాలకు, సిఫార్సులకు తావు లేకుండా కరుడుగట్టిన కార్యకర్తలని కమిటీలో నియమిస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు బీద రవిచంద్ర, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి, బ్రహ్మం చౌదరిని కడప పార్లమెంటుకు కమిటీ సభ్యులుగా నియమించి కార్యవర్గం సమాజం నుండి అభిప్రాయాలను సేకరించింది హైకమాండ్. ఈ నెలాఖరు నాటికి పార్లమెంటు కమిటీలను పూర్తి చేయాలని చంద్రబాబు నిర్ణయించడంతో పాటూ.. పార్లమెంటు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇక కడప జిల్లా అధ్యక్ష నియామం విషయానికొస్తే.. ఆశావహుల రేసులో ప్రస్తుత అధ్యక్షులు రెడ్డెప్ప గారి శ్రీనివాస రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, బాలిశెట్టి హరిప్రసాద్‌లు ఉన్నారు. వీరిలో లోకేష్ టీమ్ మెంబర్లుగా పేరుపొందిన కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్ భూపేష్ రెడ్డిలు యువత కోటాలో కనిపిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి కడప జిల్లాకు ఒకసారి, కడప జిల్లాకు రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేసి, ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డికి మరోసారి సీఎం చంద్రబాబు అవకాశం కల్పిస్తారో లేదో చూడాలి. ఇక కడప జిల్లా అధ్యక్ష రేసులో తమ పేర్లను పరిశీలించాలంటూ త్రిసభ్య కమిటీని కోరారు సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, బాలిశెట్టి హరిప్రసాద్‌లు. బలిజ సామజిక వర్గానికి ఇవ్వాలన్న ఆలోచన చేస్తే ప్రముఖంగా బాలిశెట్టి హరిప్రసాద్ ముందు వరసలో ఉంటారు. ఏదీ ఏమైనా టీడీపీ కడప జిల్లా రథసారధి ఎవరా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.
Also Read: Bhumana Karunakar Reddy: ఐఏఎస్ అధికారిణిపై భూమన సంచలన ఆరోపణలు: ‘అవినీతి అనకొండ’ అంటూ తీవ్ర విమర్శలు
2024 జనరల్ ఎలక్షన్‌లో ఉమ్మడి కడప జిల్లాలో యువ అభ్యర్థులకు అధిష్టానం పెద్ద పీట వేసింది. ఈ మార్పు కొనసాగించాలని అధిష్టానం భావిస్తే కడప జిల్లా రథ సారథ్య బాధ్యతలు యువతకే అప్పగించే చాన్స్ లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే యూత్ కోటాలో చైతన్య రెడ్డి, భూపేష్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి చుక్కలు చూపించారు జమ్మలమడుగు టీడీపీ యువనేత భూపేష్ రెడ్డి. మరోవైపు మహానాడును సక్సెస్ చేయడంలో తనదైన శైలిలో వ్యవహరించి, అందరిని కలుపుకుపోయి, సీఎం చంద్రబాబు, యువనేత లోకేష్‌ల వద్ద శభాష్ అనిపించుకున్నారు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. ఇలా ఈసారి యువ నేతని కడప అధ్యక్ష పీఠంపై చంద్రబాబు కూర్చోబెడతారా? లేక ప్రతిపక్షంలోను, అధికార పక్షంలోనూ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగిన రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డే మళ్లీ చాన్స్ కొడతారా అన్నది తీవ్ర ఉత్కంఠని రేకెత్తిస్తోంది.