Jagan Killing Politics: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనలో ఆయనపై ఏ2గా కేసు నమోదైంది. జగన్ ప్రయాణిస్తున్న కారు వైసీపీ కార్యకర్త, దళిత వృద్ధుడైన సింగయ్యను తొక్కి చంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో జగన్ కాన్వాయ్ నిర్లక్ష్యం, బాధితుడిని రోడ్డుపై అలా వదిలేసి వెళ్లడం తీవ్ర వివాదాస్పదమైంది. అయినా, జగన్‌లో కించిత్ బాధైనా కనిపించిన సందర్భం ఈ నాలుగు రోజుల్లో కనబడలేదు. తన రాజకీయ బలప్రదర్శన కోసం పేద కార్యకర్తల ప్రాణాలను బలిచ్చే ఈ తీరు.. మానవత్వం లేని ఆయన వ్యక్తిత్వాన్ని, స్వార్థ రాజకీయాన్ని బయటపెడుతోంది.
జగన్ తన సత్తెనపల్లి పర్యటనలో అన్ని అనుమతులు ఉల్లంఘించారు. అసలు అనుమతే లేని రోడ్ షో నిర్వహించారు. జన సమీకరణ కోసం గుంటూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుండి వేలాది మందిని తరలించారు. బరితెగించి బల ప్రదర్శన చేశారు. అందుకు ఫలితంగానే పేర్ని నాని, విడుదల రజినీ వంటి వైసీపీ నేతలు ఈ కేసులో నిందితులుగా మారారు. జన సమీకరణ చేయనిదే జగన్ పర్యటనలకు జనం రారు. జగన్‌ని చూసేందుకు జనం ఏమీ పనీ పాట మానేసి ఖాళీగా కూర్చోలేదు. చుట్టు పక్కల ప్రాంతాల నుండి కార్యకర్తలను తరలించి చేస్తున్న హడావుడి, ఆర్భాటం, అరాచకమే తప్ప, జనాధరణ పెరిగి కాదు.. అనడానికి ఈ ఘటనే ఎక్జాంపుల్.
అలా తరలించిన మూకలు ఏటుకూరు రోడ్డు వద్ద జగన్ కాన్వాయ్‌కు అడ్డుపడగా, ఆ తోపులాటలో సింగయ్య అనే దళిత వృద్ధుడు కిందపడ్డాడు. జగన్ కారు ఆయన్ను ఈడ్చుకెళ్లింది. ఏం జరిగిందో జగన్‌తో సహా అక్కడున్న ప్రతి ఒక్కరికీ బాగా తెలిసే ఉంటుంది. అయినా బాధితుడిని ఆస్పత్రికి తరలించకుండా, జగన్ కనుసైగతో కాన్వాయ్ ముందుకు వెళ్లిపోయింది. జగన్‌కు ఈ ఘటన తెలియకపోవడం అసంభవం. కానీ ఆయన జేజేలు కొట్టించుకోవడంలో మునిగిపోయారు. వైసీపీ నేతలు దీన్ని సాధారణ ప్రమాదంగా చిత్రీకరించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కానీ, వీడియో ఆధారాలతో నిజం బయటపడింది. జగన్‌ది అసలు రాజకీయ పర్యటనే కాదట. జగన్ ఆ కారులో ప్రయాణికుడు మాత్రమేనట. ఇలా తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ నేతలు, వైసీపీ మీడియా నానా రకాలుగా తంటాలు పడుతున్నారు. అంబటి లాంటి నేతలైతే.. సింగయ్య తమ కార్యకర్త అని, తమ కార్యకర్తను తాము చంపుకుంటే మీకొచ్చిన నొప్పేంటని ప్రశ్నిస్తుండటం.. ఆశ్చర్యం కలిగిస్తోంది.
Also Read: YS Sharmila: జగన్ ఓవర్ యాక్షన్ వల్లే.. వ్యక్తి మృతి
ఈ ఘటనలో జగన్ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం స్పష్టం. హిట్ అండ్ రన్ కేసులో సామాన్యుడైతే వెంటనే అరెస్టయ్యేవాడు, కానీ జగన్‌పై కేసు నమోదైనా నోటీసులు జారీ చేసే ధైర్యం పోలీసులకు ఉందా అన్నది సందేహమే. ప్రాణం పోయిన వెంటనే స్పందించి సింగయ్య కుటుంబానికి సాయం అందించలేదు వైసీపీ. తీవ్రమైన కేసు అవుతుందని గ్రహించిన తర్వాతే ఆఘమేఘాల మీద అంబటి రాంబాబుతో 10 లక్షల చెక్ ఇప్పించింది. నిజానికి ఇది సాక్షులను, బాధితులను ప్రభావితం చేయడమే అవుతుంది. ఇలా.. జగన్ రాజకీయం కార్యకర్తలకు శాపంగా మారింది. సొంత కార్యకర్తల ప్రాణాలు పోయినా, వారు జైళ్ల పాలు అయినా ఆయన పట్టించుకోరు. రవితేజ అనే కార్యకర్త జగన్ కోసం నరుకుడు పోస్టర్ ప్రదర్శించి జైలుకెళ్లినా, వైసీపీ అతడిని టీడీపీ కార్యకర్తగా చిత్రీకరించింది తప్ప న్యాయ సహాయం అందించలేదు. అయితే జగన్ విశ్వసనీయతపై ఇప్పుడు కార్యకర్తల్లోనే సందేహాలు మొదలయ్యాయి. ఆయనకు కన్నతల్లి, చెల్లిపైనే మమకారం లేనప్పుడు, తమపై ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలో పడుతోంది వైకాపా క్యాడర్. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే.. గతంలో వైసీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలకు కరెక్టుగా సరిపోతాయన్న వాదన వినబడుతోంది.
దీనికి భిన్నంగా, చంద్రబాబు నాయుడు 2022లో చీపురుపల్లి పర్యటనలో బైక్ ప్రమాదంలో గాయపడిన ఇద్దరిని తన కాన్వాయ్ అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి, స్థానిక నాయకులను అక్కడే ఉంచి వెళ్లారు. ఈ తేడా జగన్, చంద్రబాబుల మధ్య తేడాను స్పష్టం చేస్తుంది. జగన్ రాజకీయ స్వార్థం కోసం పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతుండటాన్ని ప్రజలు, ఆ పార్టీ కార్యకర్తలు ఇకనైనా గుర్తించాలి అంటున్నారు పరిశీలకులు. సంగయ్య లాంటి అమాయకులు బలవుతున్న ఈ నీతి రహిత రాజకీయం నుంచి వారు బయటపడకపోతే, మరిన్ని కుటుంబాలు నష్టపోతాయని హెచ్చరిస్తున్నారు.