BRS Silver Jubilee: పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానం… పదేండ్ల పాలన మేళవింపుతో తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు సిద్ధమైంది. బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. లక్షలాది మందితో జరిగే రజతోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమైంది. హనుమకొండ జిల్లాలోని మండల కేంద్రమైన ఎల్కతుర్తి ఈ మహాసభకు వేదిక కాబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది జనాలు తరలివచ్చేందుకు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా… ఎల్కతుర్తిని సభావేదికగా నిర్ణయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ మహాసభ ఏర్పాట్లలో నిగమ్నమయ్యారు. రజోత్సవ మహాసభ వేదిక, బహిరంగసభ, పార్కింగ్, ప్రజలకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు వేగంగా ప్రణాళిక రూపొందింది.
60 ఏండ్ల ఆకాంక్షల ప్రతిరూపంగా 2001 ఏప్రిల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి.. ఉద్యమం నడిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. 2014 నుంచి పదేండ్ల పాటు తెలంగాణలో బిఆర్ఎస్ అధికారంలో ఉంది. 14 ఏండ్ల ఉద్యమం, 10 ఏండ్ల పరిపాలన మేళవింపుగా ఏప్రిల్ 27న రజతోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. భారీ బహిరంగసభలు అంటేనే బీఆర్ఎస్ అని దేశ రాజకీయాల్లో ఒక నానుడి ఉంది. స్వరాష్ట్ర సాధన లక్ష్యంగా సాగిన ఉద్యమ వ్యూహంలో భాగంగా బీఆర్ఎస్ ఎన్నో భారీ బహిరంగ సభలను నిర్వహించింది. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలు ప్రపంచ రికార్డులను నమోదు చేశాయి. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సైతం అంతే స్థాయిలో ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఎల్కతుర్తిలోని 1,213 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ సిద్దమౌతోంది. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల వాహనాల్లో ప్రజలొస్తారని అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ వేదిక సిద్ధమవుతోంది.
BRS Silver Jubilee: లక్షలాదిగా ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు, వేలాది వాహనాల రాకపోకలకు అనువుగా ఉండేలా వరంగల్ నగర సమీపంలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. దీనికి కొనసాగింపుగా వరంగల్ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు అనువైన స్థలాలను పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు రోడ్డు మార్గంతో అనుసంధానమయ్యే.. రెండు జాతీయ రహదారుల జంక్షన్ అయిన ఎల్కతుర్తి పట్టణాన్ని మహాసభకు అనువైన స్థలంగా గుర్తించారు. రెండు జాతీయ రహదారుల కూడలికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ వేదిక ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన స్థలం, రవాణా పరంగా అనుకూలంగా ఉండటంతో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ఎల్కతుర్తి వేదికగా నిలిచింది.
Also Read: supreme court: హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం సీరియస్
మహాసభ అవసరాలకు అనుగుణంగా అన్నిరకాల వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ఎండకాలం కావడంతో జనాలు ఇబ్బందులు పడకుండా బహిరంగసభ ప్రదేశంలో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను, మరో 10 లక్షల ఆఫ్ లీటరు వాటర్ బాటిళ్లను సిద్ధంగా ఉంచనున్నారు. వారికి అన్నిరకాలుగా సహకారం అందించేందుకు 1,500 మంది వలంటీర్లను నియమిస్తున్నారు. లక్షలాదిగా వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండేలా వలంటీర్లు సమన్వయం చేయనున్నారు. రిటైర్డ్ పోలీస్ అధికారులతో వీరికి శిక్షణ ఇప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళలు, పురుషుల కోసం వేల సంఖ్యలో టాయిలెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపాందించారు. అత్యవసర వైద్యసేవలను అందుబాటులో ఉంచనున్నారు. ఎల్కతుర్తికి వాహనాలు వచ్చే అన్ని దారుల్లో అంబులెన్‌లను సిద్ధంగా ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
BRS Silver Jubilee: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధికారం కోల్పోయిన 15 నెలల తర్వాత సభను నిర్వహిస్తున్నందున భారీ జన సమీకరణ చేసి సత్తాను చాటాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సభ నిర్వహణ భాద్యతలు చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పళ్ల రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఒడితెల సతీష్ తదితర నేతలతో ఎప్పటికప్పుడు కేసీఆర్ మాట్లాడుతూ దిశా నిర్దేశం చేస్తున్నారు!