BRS Fear About Media

BRS Fear About Media: బీఆర్‌ఎస్‌ రాజకీయం… మాట్లాడితే రాళ్లు, రాళ్లు..!

BRS Fear About Media: ప్రపంచం ఓ కుగ్రామంలా మారిన నేటి పరిస్థితుల్లో, ఎవరికైనా ఎక్కడైనా స్వేచ్ఛగా బతికే హక్కున్న ప్రజాస్వామ్య దేశంలో, మీడియాకు ప్రాంతీయతను, కులాన్ని ఆపాదిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, దాడులు చేస్తున్న విధానాన్ని ఎండగడుతూ.. శనివారం ప్రసారమైన ఏబీఎన్‌ ఆర్కే వీకెండ్‌ కామెంట్‌ బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు సృష్టించింది. మంచి అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్‌ నుండి హైదరాబాద్‌ వచ్చిన వారే తప్ప.. ఇక్కడ ఎవరి మీదో ఆధారపడి, ఎవరి తిండో తినడానికి ఎవరూ రాలేదన్న వాస్తవాన్ని సూటిగా చెప్పారు రాధాకృష్ణ. ఎక్కడ ఉంటున్నరు? ఎవరి తిండి తింటున్నరు? అంటూ మీడియా చానల్స్‌పై మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి పేలిన ప్రేలాపనలకు సమాధానం చెబుతూ.. అదే తప్పయితే… అదే దోపిడీ అయితే… జగదీష్‌ రెడ్డి కుమారుడు లండన్‌లో చదువుకోవడాన్ని ఏమనాలి? కేటీఆర్‌, కవితలు అమెరికాలో ఉద్యోగాలు చేయడాన్ని ఎలా చూడాలి? అక్కడి దేశస్తులు కూడా ఇలాగే వివక్ష చూపిస్తే సమంజసమే అనగలరా? అంటూ సూటి ప్రశ్నలు సంధించారు ఆర్కే. ఆయన లేవనెత్తిన అంశానికి నిలువెత్తు నిదర్శనంగా… సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

అమెరికాలో ఏం పని మీకు? ఎక్కడ చూసినా మీరే ఉన్నారు… అంటూ ఒక అమెరికన్‌ మన తెలుగు వ్యక్తిపై చేస్తోన్న దాడిని ఈ వీడియోలో చూడొచ్చు. దీనిని చూసిన ఏ భారతీయుడు కూడా సహించలేకపోతున్నాడు. మరి తెలంగాణలో బీఆర్ఎస్‌ చేస్తున్నది ఇంతకంటే దారుణం కాదా? దాడుల ద్వారా మీడియా గొంతు నొక్కగలరా? తెలంగాణ బీఆర్ఎస్‌ జాగీరా? కేసీఆర్‌, కేటీఆర్‌ తప్పుల్ని ప్రశ్నిస్తే.. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించినట్లవుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకే మరోసారి మహాన్యూస్‌పై చేసిన దాడి తరహాలోనే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపైనా దాడి చేస్తామంటూ సోషల్‌మీడియాలో బెదిరింపులకు దిగింది బీఆర్‌ఎస్‌. దీంతో సోమవారం ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన బెదిరింపులతో.. సోమవారం నాడు పోలీసుల పహారాలో ఆంధ్రజ్యోతి ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.

Also Read: EX MLA Prasanna Kumar Reddy: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి – ఫర్నీచర్, కారు ధ్వంసం

BRS Fear About Media: మహాన్యూస్‌పై చేసినట్లే ఏబీఎన్‌, టీవీ 5, ఈనాడు సంస్థలపై దాడి చేయాలంటూ కొందరు బీఆర్‌ఎస్‌ వ్యక్తులు సోషల్‌మీడియా వేదికగా బెదిరింపులకు దిగడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసిన కథనం వాస్తవమని.. తెలంగాణ కేసీఆర్ జాగీరా అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. ఏబీఎన్ మీద దాడి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు ఛానల్ ఉందని.. ఆ ఛానల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. వాడు వీడు అని తిడితే కేసీఆర్ కుటుంబం కార్లను కూడా తిరగనివ్వమన్నారు. రాధాకృష్ణ రాసింది ముమ్మాటికీ వాస్తవమని బండి సంజయ్ స్పష్టం చేశారు. “ఏబీఎన్ మీద దాడి చేసి చూడు… నీ బీఆర్ఎస్ భవన్‌ను ఏం చేస్తామో తెలుస్తుంది” అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్‌. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ నూతన అధ్యక్షులు రామచందర్‌ రావు కూడా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మీడియా సంస్థలపై దాడి చేశారో ఖబడ్దార్.. టీ న్యూస్ అంతు చూస్తామంటూ హెచ్చరించారు రామచందర్‌రావు. తక్షణమే ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలకు రక్షణ కల్పించాలని బీజేవైఎం కార్యకర్తలకు తెలంగాణ బీజేపీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు.

ఇక ఈ అంశంపై కాంగ్రెస్‌ నేతలు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలన దెబ్బకు తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్‌ను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్లుగా వ్యవహరిస్తున్నారనీ, బీఆర్ఎస్ తప్పుడు విధానాలను ఎత్తి చూపిస్తే ఆంధ్రా పత్రికలంటూ మాట్లాడుతున్నారనీ, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణలో బీహార్ తరహా సంస్కృతి తీసుకువస్తున్నారనీ, బీఆర్ఎస్ నేతల ఆటలు ఇక సాగవనీ హెచ్చరించారు. బీఆర్ఎస్ దగ్గర అస్త్రాలన్నీ అయిపోయాయి కాబట్టే… తెలంగాణ సెంటిమెంట్‌ను ముందుకు తెస్తున్నారని ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *