BRS Boggu Sangam

BRS Boggu Sangam: ఆగమాగం అవుతున్న బీఆర్‌ఎస్‌ యూనియన్..

BRS Boggu Sangam: సింగరేణిలో 10 ఏళ్లు వెలుగు వెలిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఒక్కసారిగా సైలెంట్ అయింది. ఆ కార్మిక సంఘాల నేతల హడావుడి గతంలో అంతా ఇంతగా ఉండేది కాదు. ఇప్పుడు కార్మికుల పక్షాన బయటకు వచ్చి పోరాడే పరిస్థితి కనిపించడం లేదు. సంఘాన్ని నడిపే అగ్రనేతలు సైలెంట్‌గా మారడమే చర్చనీయాంశంగా మారింది. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీలో తిరుగుబాటు తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఇంకా సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగానే కొనసాగుతున్నారు. అయితే, సంఘ ముఖ్య నేతలు, కార్మికులు ఆమె వెంట వెళ్లాలా, వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. దీనికి కారణం… ఆమె భవిష్యత్తులో రాజకీయంగా నిలదొక్కుకుంటారా అన్న అనుమానమే. ఒకవేళ కేటీఆర్ బలంగా తెరపైకి వస్తే, అప్పుడు తమ పరిస్థితి ఏంటని కార్మిక సంఘాల నేతలు వెనక, ముందు ఆలోచిస్తున్నారు. అలా అని కవితకు దూరంగా కూడా ఉండలేకపోతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కొంతమంది కార్మిక సంఘాల ముఖ్య నేతలు ఇటీవల కేటీఆర్‌ను కలిసినప్పుడు, త్వరలోనే అందరితో సమావేశం పెడదామని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కార్మిక సంఘాల నేతలు… కవిత వైపా, కేటీఆర్ వైపా… ఎటు వెళ్లాలో తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలో సైలెంట్‌గా ఉండిపోతున్నారు. రాజకీయాలు మారి, అన్నా, చెల్లెలు ఒకటైతే, తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుందని కార్మిక సంఘాల నేతలు, కార్మికులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.

సింగరేణిలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పరిస్థితి కొంతకాలంగా దయనీయంగా మారింది. అధిష్ఠానం పెద్దల కుటుంబంలో వచ్చిన వైరుధ్యాలు ఆ సంఘం మనుగడపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని సొంత యూనియన్ నేతలే చర్చించుకుంటున్నారు. నేతలు రెండు వర్గాలుగా మారడంతో, తాము ఎవరి వైపు ఉండాలో తెలియక టీబీజీకేఎస్ నేతలు సతమతమవుతున్నారు. ఒకరికి జై కొడితే, ఇంకొకరు కన్నెర్ర చేసే పరిస్థితి. దీంతో వారు సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతున్నారు. మరీ ముఖ్యంగా కేటీఆర్, కవిత మధ్య ఇటీవల జరుగుతున్న రాజకీయ వైరుధ్యం వల్ల, ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టీబీజీకేఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాతో పాటు సింగరేణి ప్రాంతాల్లో పర్యటించారు. ఆ సమయంలో కార్మిక సంఘం నేతలు ఆమెను కలవాలా, వద్దా అనే మీమాంసలో ఉండిపోయారంట. కొంతమంది నేతలు భయం భయంగానే వెళ్లి సీక్రెట్‌గా కలిశారట. ఆమె వెంట వెళ్లాలా, వద్దా అనే మీమాంశతో చాలామంది దూరంగానే ఉన్నారంట.

Also Read: Harish Rao: నేడు మ‌రోసారి కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందుకు హ‌రీశ్‌రావు

BRS Boggu Sangam: తెలంగాణలోని ఉమ్మడి ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిపై పట్టు బిగిస్తే, రాష్ట్రం మొత్తం పట్టు వస్తుందనే భావనలో నేతలు ఉన్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఇక్కడ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు చేశారు. అయితే, ఆ యూనియన్ మొదలైనప్పటి నుంచి వర్గపోరు సాగుతూనే ఉంది. ఇప్పుడు సైతం యూనియన్ నేతల్లో ఏం చేయాలనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఒకవేళ బీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకుంటే, టీబీజీకేఎస్‌తో ముందుకు సాగొచ్చని కవిత తన మొదటి అడుగు ఇటు వేసినట్లు భావిస్తున్నారు. అయితే, టీబీజీకేఎస్ నేతల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆమె కూడా నైరాశ్యంలో పడిపోయారట. అదే సందర్భంలో కేటీఆర్ సైతం యూనియన్‌తో మాట్లాడతానని చెప్పడంతో, ఇప్పుడు వ్యవహారం కాస్తా రసకందాయంలో పడింది. వారిద్దరి మధ్య యూనియన్ నలిగిపోతోందని యూనియన్ నేతలు, కార్మికులు చెబుతున్నారు. వాస్తవానికి గుర్తింపు సంఘం ఎన్నికల దగ్గర నుంచి యూనియన్‌ని కుటుంబ జేబు సంస్థగా మార్చారన్న అపవాదు ఉంది. సింగరేణి ఎన్నికల్లో తొలుత పోటీ చేయొద్దని, ఆతర్వాత చేయాలని… ఇలా రెండు మూడు రకాలుగా నిర్ణయాలు తీసుకోవడంతో విస్తుపోవడం కార్మిక సంఘం నేతల వంతైంది. అప్పటి నుంచి అసంబద్ధమైన నిర్ణయాలు, అస్పష్టమైన నేతల అభిప్రాయాలతో పాటు కార్మిక వర్గం వైపు సాగించే పోరాటాల్లో సైతం దూకుడుతనం లేకపోవడంతో సొంత యూనియన్‌లోనే నైరాశ్యం నెలకొంది.

నల్ల బంగారు నేలలో బాణం విరిగిపోయిందంటూ ప్రతిపక్ష యూనియన్లు చేస్తున్న ఎద్దేవా వాస్తవరూపం దాల్చిందని చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతల ఆధిపత్య పోరుతో ఆగమాగం అవుతున్న యూనియన్… కార్మికులకు పూర్తిగా దూరం అవుతోందని కార్మికులు చెబుతున్నారు. కేసీఆర్ నుంచి ఏదైనా పిలుపు వస్తే, క్లారిటీ ఇస్తే తప్ప, ఆ సంఘం ఎవరి వైపు అడుగులు వేస్తుందనే అంశానికి తెరపడదని కార్మిక సంఘం నేతలు అంటున్నారు. అప్పటి వరకు లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ అంటున్నారు టీబీజీకేఎస్‌ నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *