BC Weapon in Local War

BC Weapon in Local War: స్థానిక ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు అగ్ని పరీక్షే

BC Weapon in Local War: బీఆర్ఎస్‌కు స్థానిక ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి 20 నెలలు అవుతున్నప్పటికీ పార్టీ పటిష్టతపై దృష్టి సారించలేకపోవడం, క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కమిటీలు వేయలేకపోవడం, పార్టీ కోసం పనిచేస్తున్నవారికి కనీసం కమిటీల్లోనైనా స్థానం లభిస్తుందని, పార్టీ గుర్తింపు ఇస్తుందని ఎదురుచూస్తున్న నేతలకు నిరాశే ఎదురవుతుందట. ఈ తరుణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లి, మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తారనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌ అయ్యిందట. కనీసం నేతలను పిలిచి మాట్లాడటం లేదని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని, ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహంతో ఉన్నారట. ఈ పరిణామాలు అన్నీ స్థానిక ఎన్నికల్లో పార్టీకి అగ్ని పరీక్షగా మారనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కానున్నాయి. పార్టీ సైతం గ్రామస్థాయిలో ఏ మేరకు పటిష్టంగా ఉందనేది కూడా ఈ ఎన్నికలతో స్పష్టమవుతుంది. మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తే ఇప్పటివరకు పార్టీ కేడర్‌లోని నైరాశ్యం పోయి, నూతనోత్సాహం వస్తుంది. అందుకోసం పార్టీ కేడర్‌ను అధిష్టానం సన్నద్ధం చెయ్యాలని కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్‌కు మలుపు అని ప్రకటించారు. అంతేకాదు, లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు ఫ్రీ ఫైనల్స్ లాంటివని, ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని ప్రకటించారు. మరోవైపు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సైతం అందరూ కలిసి పనిచేయాలని, మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. 31 జడ్పీ స్థానాల్లో 16 నుంచి 18 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుదాం అంటూ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని పేర్కొంటూ కేడర్లో ధీమా కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, పోటీచేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చి, సమిష్టిగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు. అయితే… బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై దాదాపు 20 నెలలు కావస్తున్నా… పార్టీ ఓటమికి గల ముఖ్య కారణాలను విశ్లేషించలేదనీ, కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయాలను సేకరించలేదనీ, గ్రామస్థాయి నుంచి పార్టీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎందుకు ఓడిపోయాం? అనే దానిపై పీడ్ బ్యాక్ కూడా తీసుకోవట్లేదని సొంత క్యాడర్‌, లీడర్లే ఆరోపిస్తున్నారు.

Also Read: Supreme Court Of India: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు కీల‌క తీర్పు

పార్టీలో కీలక నేతగా పనిచేసిన ఎమ్మెల్సీ కవిత… జాగృతి పేరుతోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు తప్ప, బీఆర్‌ఎస్‌ పేరుతో, గులాబీ జెండాలతో సమావేశాలు నిర్వహించట్లేదు. అంతేకాదు, ఆమె కార్యక్రమాలకు గులాబీ నేతలు సైతం దూరంగా ఉంటున్నారనేది ఆమె చేపడుతున్న కార్యక్రామాలతోనే స్పష్టమవుతున్నది. అయితే, స్థానిక సంస్థల్లో ఆమె ఎలా ముందుకెళ్తారు? అనేది ప్రశ్నార్ధకమే. కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్టు చేసే విధంగా ఉన్నాయని గులాబీ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇది బీఆర్ఎస్‌కు డ్యామేజ్ చేస్తుందని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌వీ ఎఫెక్ట్ పడుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలన్నీ బీఆర్ఎస్‌కు పరీక్షగా మారాయి. దానికి తోడు కవిత లేవనెత్తిన పార్టీ విలీన అంశాన్నే… మరోసారి బిజెపి ఎంపీ సీఎం రమేష్ తెరపైకి తేవడంతో పార్టీకి నష్టం జరిగిందనీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

20 నెలలుగా పార్టీలో గుర్తింపు, అవకాశాలు లేక నిరాశ పడిపోయిన గులాబీ క్యాడర్‌, లీడర్లు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా యాక్టివ్‌గా పనిచేస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అధినేతలు ముందుకొచ్చి అరచేతిలో వైకుంఠం చూపిస్తే… నేతలు ఎలా విశ్వసించి ముందుకు సాగుతారనేది కూడా చర్చనీయాంశమైంది. చూడాలి మరి పార్టీ బలోపేతంపై గులాబీ బాస్ ఏమి చర్యలు తీసుకుంటారో.!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *